KCR: ఈ దేశం నాది అనే అభిప్రాయం ప్రతి ఒక్కరిలో రావాలి: కేసీఆర్​

  • పేదరికం ఉన్నంత కాలం దేశంలో అలజడి, అశాంతి ఉంటాయన్న కేసీఆర్ 
  • దేశంలో పేదరికం పూర్తిగా తొలగితేనే అభివృద్ధి చెందినట్టు అని వ్యాఖ్య  
  • అంతా ఐకమత్యంతో ఉండి భారత జాతి ఔన్నత్యాన్ని చాటాలని పిలుపు
Kcr speech in swathantra vajrotsavalu at Hyderabad

దేశంలో పేదరికం ఉన్నంతకాలం అలజడులు, అశాంతి ఉంటాయని.. పేదరికం పూర్తిగా తొలగిపోతేనే అభివృద్ధి సాధిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. ఈ దేశం నాది అనే అభిప్రాయం ప్రతి ఒక్కరిలో కలగాలని.. అప్పుడే మహోజ్వల భారత్ సాకారమవుతుందని చెప్పారు. భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా హైదరాబాద్ లో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. వజ్రోత్సవ వేడుకలను అద్భుతంగా నిర్వహించుకుందామని పిలుపునిచ్చారు.

గాంధీజీ నాయకత్వంలోనే అంతా..
ఇప్పటి తరానికి స్వాతంత్ర్య పోరాట ఘటనలేవీ తెలియవని.. అనేక పోరాటాలతో స్వాతంత్ర్యం వచ్చిందని కేసీఆర్ అన్నారు. నాటి బ్రిటీష్ ప్రభుత్వం ఉద్యమ కారులను అణచివేయడానికి ప్రయత్నించిందని.. గాంధీజీ ఎన్నో త్యాగాలు చేసి స్వాతంత్ర్యం సిద్ధించేందుకు కృషి చేశారని చెప్పారు. గాంధీజీ స్ఫూర్తితోనే అమెరికా అధ్యక్షుడిని అయ్యానని బరాక్‌ ఒబామా చెప్పిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. కానీ కొందరు గాంధీజీని కించపర్చేలా ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చాక దేశాన్ని కలిపి ఉంచేందుకు ఎంతోమంది ఎంతగానో కష్టపడ్డారని.. సంస్థానాలను దేశంలో విలీనం చేయించారని చెప్పారు.

తెలంగాణలో అద్భుతంగా శాంతి భద్రతలు
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చాక శాంతి భద్రతలను అద్భుతంగా నిర్వహిస్తున్నామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. కొందరు రాజకీయ నాయకుల చిల్లర మల్లర చేష్టలను ప్రతి ఒక్కరూ చీల్చి చెండాడాలని.. ఐకమత్యంతో ఉండి భారత జాతి ఔన్నత్యం చాటాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.

More Telugu News