Venkaiah Naidu: వెంకయ్యనాయుడి సేవలను కీర్తించిన ప్రధాని మోదీ

  • మీ చమత్కారం గురించి చెప్పుకోవాల్సిందేనన్న ప్రధాని మోదీ
  • చేపట్టిన ప్రతీ బాధ్యతను అంకిత భావంతో పనిచేశారని ప్రశంస
  • జాతికి మీ సేవలు ఇక ముందూ అవసరమన్న ప్రధాని
Your one liners are wit liners What PM Modi said at Venkaiah Naidu farewell

ఉపరాష్ట్రపతిగా మరో రెండు రోజుల్లో బాధ్యతల నుంచి తప్పుకోబోతున్న వెంకయ్యనాయుడి సేవలను ప్రధాని నరేంద్ర మోదీ హృదయపూర్వకంగా ప్రశంసించారు. వెంకయ్యనాయుడి సేవలపై రాజ్యసభలో ప్రధాని ప్రసంగించారు. రాజ్యసభ చైర్మన్ హోదాలో ఎగువ సభ ప్రయాణాన్ని నాయుడు మరింత ముందుకు తీసుకెళ్లారని, సభలో ఉత్పాదకతను పెంచారని కొనియాడారు. 

‘‘రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీ కాలం ముగిసిపోయే సమయం వచ్చినందున ఆయనకు ధన్యవాదాలు తెలియజెప్పేందుకు మనమంతా నేడు ఇక్కడ సమావేశమై ఉన్నాం. ఇది ఎంతో భావోద్వేగంతో కూడిన సందర్భం. ఈ సభకు సంబంధించి ఎన్నో చారిత్రక క్షణాలు మీ మనోహరమైన ఉనికితో ముడిపడి ఉంటాయి.

వెంకయ్యనాయుడి గురించి చెప్పుకోవాల్సిన ఒక విశిష్టత ఉంది. అది చమత్కారం. భాషలపై ఆయనకున్న పట్టు ఎప్పుడూ ఎంతో ఉన్నతమైనది. ఆయన గురించి ప్రశంసించాల్సిన వాటిల్లో ఒక ముఖ్యమైనది.. భారత భాషల పట్ల ఆయనకున్న ప్యాషన్. ఆయన సభకు అధ్యక్షత వహించిన తీరులో ఇది కనిపించింది. 

నాయుడూజీతో నేను ఎన్నో ఏళ్లుగా కలసి పనిచేశాను. ఎన్నో బాధ్యతలు చేపట్టడమే కాకుండా, ప్రతీ ఒక్కదానినీ గొప్ప అంకిత భావంతో నిర్వహించడాన్ని నేను స్వయంగా చూశాను’’ అని వెంకయ్యనాయుడి సేవలను ప్రధాని మోదీ ప్రస్తావించారు. జాతికి వెంకయ్యనాయుడి సేవలు, మార్గదర్శకం ఇక ముందూ కావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. 

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, స్పీకర్, ప్రధాని అందరూ స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత జన్మించిన వారు కాగా, వారి మార్గదర్శకంలో ఈ ఏడాది 75వ స్వాతంత్య్ర దినోత్సవాలను జరుపుకోవడం విశేషంగా ప్రధాని పేర్కొన్నారు. 

వెంకయ్యనాయుడి సేవలను ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున ఖర్గే సైతం ప్రస్తుతించారు. ‘‘మనం భిన్నమైన సిద్ధాంతాలు కలిగిన వారం కావచ్చు. నాకు మీ విషయంలో కొన్ని ఫిర్యాదులు కూడా ఉండొచ్చు. కానీ, వాటి గురించి మాట్లాడే సమయం కాదు ఇది. కష్టమైన, ఒత్తిళ్ల మధ్య మీరు మీ పాత్రను సమర్థంగా నిర్వహించారు. అందుకు మీకు ధన్యవాదాలు’’ అని ఖర్గే పేర్కొన్నారు. పలువురు ఎంపీలు కూడా మాట్లాడారు. అనంతరం రాజ్యసభ మధ్యాహ్నం 2.05 గంటల వరకు వాయిదా పడింది.

More Telugu News