చెల్లెలు కలగన్న నంబర్​.. అక్కకు రూ.20 లక్షల లాటరీ తగిలింది!

07-08-2022 Sun 16:50
  • అమెరికాలోని మేరీల్యాండ్ లో 68 ఏళ్ల పెద్దావిడకు అదృష్టం
  • అక్క ఏదో చిత్రమైన నంబర్ ఉన్న బస్సులో ప్రయాణిస్తున్నట్టు చెల్లెలికి కల
  • రూ.40 పెట్టి ఆ నంబర్ లాటరీ టికెట్ కొన్న అక్క.. 25 వేల డాలర్ల జాక్ పాట్
US woman wins rs 20 lakh lottery using numbers her sister dreamed
అమెరికాలోని మేరీల్యాండ్ కు చెందిన 68 ఏళ్ల వృద్ధురాలు.. ఎప్పటికైనా ఇన్ని డబ్బులు సంపాదించాలని కోరిక. అందుకే అప్పుడప్పుడూ లాటరీ టికెట్లు కొంటూ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటుంది. ఇలా ఎన్నిసార్లు చేసినా, ఎప్పుడూ లాటరీ తగలకపోయినా.. లాటరీ టికెట్లు కొంటూనే వచ్చింది. అయితే ఇటీవల ఆమె సోదరి (చెల్లెలు)కి ఓ కల వచ్చింది. అక్క 23815 నంబర్ ఉన్న బస్సులో ప్రయాణిస్తున్నట్టుగా కలలో కనిపించింది. చెల్లెలు ఆ మరునాడు ఈ విషయాన్ని అక్కకు చెప్పడంతో.. ఆమెకు ఏదో ఆలోచన వచ్చింది.

కేవలం రూ.40 టికెట్ కొంటే..
చెల్లెలు కలలో కనిపించిన నంబర్ లాటరీ నంబర్ అయి ఉండవచ్చని అక్కకు అనిపించింది. దీంతో దగ్గరిలోని ఓ లాటరీ ఏజెంట్ దగ్గరికి వెళ్లి.. 2–3–8–1–5 సీరియల్ నంబర్ ఉన్న లాటరీ టికెట్ ను, మరో రెండు లాటరీ టికెట్లనూ కొనుగోలు చేసింది. దాని ధర కేవలం రూ.40 (50 సెంట్లు–అర డాలర్) మాత్రమే కావడం గమనార్హం. చిత్రమేమిటంటే.. జులై 29న జరిగిన డ్రాలో ఇదే నంబర్ కు ఏకంగా 25 వేల డాలర్ల (సుమారు రూ.20 లక్షలు) బహుమతి తగిలింది. దీంతో అక్క ఆనందానికి హద్దే లేకుండా పోయింది.
  • ‘‘మొదటి రెండు టికెట్లను చెక్ చేసుకున్నా కానీ ఏమీ తేలలేదు. మా సోదరి చెప్పిన నంబర్ ఉన్న మరో టికెట్ ను చెక్ చేసుకోగానే ఒక్కసారిగా షాక్ వచ్చినంత పనైంది. కాసేపు నన్ను నేనే నమ్మలేకపోయాను..” అని సదరు మహిళ పేర్కొన్నట్టు స్థానిక వార్తా సంస్థ వెల్లడించింది.
  • చిత్రమేమిటంటే.. ఇటీవలే వర్జీనియా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తన కలలో వచ్చిన నంబర్ లాటరీ టికెట్ ను కొనగా.. ఏకంగా రూ.1.97 కోట్లు బహుమతి రావడం గమనార్హం.