Chandrababu: భర్త నారాయణ మృతిపై పద్మ చేస్తున్న పోరాటం 'జైభీమ్' సినిమాలోని సినతల్లిని తలపిస్తోంది: చంద్రబాబు

  • నెల్లూరు జిల్లాలో అనుమానాస్పద మృతి
  • పోలీసులు కొట్టడం వల్లే చనిపోయారంటున్న భార్య
  • ఎస్సై కరీముల్లాపై ఆరోపణలు
  • ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు
  • విచారణ చేపట్టిన జాతీయ కమిషన్
Chandrababu responds on suspicious death of Udayagiri Narayana

నెల్లూరు జిల్లా కందమూరుకు చెందిన ఉదయగిరి నారాయణ అనే ఎస్సీ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తెలిసిందే. అయితే పోలీసులు కొట్టిన దెబ్బల వల్లే నారాయణ చనిపోయాడని కుటుంబ సభ్యులు అంటున్నారు. ఎస్సై కరీముల్లా కొట్టడంతోనే తన భర్త మరణించాడంటూ నారాయణ భార్య పద్మ ఇప్పటికే జాతీయ ఎస్సీ కమిషన్ ను ఆశ్రయించారు. దీనిపై ఎస్సీ కమిషన్ విచారణ కూడా చేపట్టింది. 

ఈ నేపథ్యంలో, ఉదయగిరి నారాయణ మృతి అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. భర్త ఉదయగిరి నారాయణ మృతిపై పద్మ చేస్తున్న పోరాటం చూస్తుంటే 'జై భీమ్' చిత్రంలోని సినతల్లిని తలపిస్తోందని తెలిపారు. ఆమె నెల్లూరు సినతల్లి అని పేర్కొన్నారు. బెదిరింపులకు బెదరక, ప్రలోభాలకు లొంగక భర్త మరణంపై అలుపెరుగని పోరాటం చేస్తున్న నెల్లూరు దళిత మహిళను అభినందిస్తున్నానని చంద్రబాబు వివరించారు. 

పొదలకూరు ఎస్సై కరీముల్లా కొట్టడం వల్లే తన భర్త చనిపోయాడని, నిందితులకు శిక్ష పడాలని వ్యవస్థలకు, ప్రభుత్వానికి ఎదురు నిలిచి దళిత మహిళ చేస్తున్న పోరాటం అసామాన్యం అని అభివర్ణించారు. దళితవర్గ పోరాటంతో, జాతీయ ఎస్సీ కమిషన్ విచారణతో ప్రభుత్వం కదలక తప్పలేదని చంద్రబాబు వెల్లడించారు. పద్మ కుటుంబానికి పరిహారంతో సరిపెట్టకుండా, ఆమె భర్త మృతికి కారణం అయిన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పద్మపోరాటంలో అడుగడుగునా అండగా నిలిచారంటూ దళిత సంఘాలకు, రాజకీయ పార్టీల నేతలకు చంద్రబాబు అభినందనలు తెలిపారు. 

దళితుడి హత్య కేసును నీరుగార్చేందుకు చేస్తున్న సిగ్గుమాలిన ప్రయత్నాన్ని ఇకనైనా కట్టిపెట్టాలని హితవు పలికారు. ముగ్గురు బిడ్డలు అనాథలైన ఘటనలో బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

More Telugu News