బింబిసార చిత్రంపై రివ్యూ ఇచ్చిన అల్లు అర్జున్

  • కల్యాణ్ రామ్ హీరోగా వచ్చిన బింబిసార
  • దర్శకుడిగా పరిచయమైన వశిష్ట
  • బింబిసార చిత్రానికి హిట్ టాక్
  • మొదటి ఆట నుంచే ప్రేక్షకాదరణ 
  • అన్ని వయసులవారికీ వినోదం అంటూ బన్నీ స్పందన
Allu Arjun opines on Bimbisara movie

నందమూరి కల్యాణ్ రామ్ ప్రధానపాత్రలో నటించిన బింబిసార చిత్రం ఈ నెల 5న రిలీజై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. కొత్త దర్శకుడు వశిష్ట తెరకెక్కించిన ఈ విలక్షణ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది. తాజాగా ఈ చిత్రంపై టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందించారు. బింబిసార చిత్రబృందానికి శుభాభినందనలు తెలిపారు. బింబిసార చిత్రం చాలా ఆసక్తికరంగా ఉందని, సినిమా చూస్తున్నంత సేపు మనల్ని కూడా తనతో పాటు తీసుకెళుతుందని వివరించారు. 

నందమూరి కల్యాణ్ రామ్ గారు ప్రభావవంతంగా నటించారని కొనియాడారు. ఎల్లప్పుడూ కొత్త తరహా కథలతో, ఇండస్ట్రీలోకి కొత్త టాలెంట్ ను తీసుకువచ్చేందుకు కల్యాణ్ రామ్ ప్రయత్నిస్తుంటారని, ఈ సినిమాతో ఆయన పట్ల గౌరవం మరింత పెరిగిందని తెలిపారు. దర్శకుడిగా తొలి సినిమానే అయినా, ఎంతో నైపుణ్యంతో ఎక్కడా తడబడకుండా ఈ సినిమాను తెరకెక్కించిన వశిష్టను అభినందిస్తున్నానని అల్లు అర్జున్ పేర్కొన్నారు. 

ఈ చిత్రంలో నటించిన కాథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ తదితరులకు, ఎంఎం కీరవాణి వంటి టెక్నీషియన్లకు, చిత్రనిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ కు నా ప్రశంసలు అంటూ బన్నీ ట్వీట్ చేశారు. అంతేకాదు, సింగిల్ లైన్ లో బింబిసార రివ్యూ ఇచ్చారు. "బింబిసార: అన్ని వయసుల వారిని రంజింపజేసే వినోద్మాక చిత్రం" అంటూ తన స్పందన తెలియజేశారు.

More Telugu News