Team India: వెస్టిండీస్‌తో నాలుగో టీ 20లో భారత్ విజయం.. సిరీస్ కైవసం

  • సమష్టిగా రాణించిన టీమిండియా
  • మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం
  • ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా అవేశ్ ఖాన్
India seal series with clinical win aganist windies

విండీస్‌తో జరిగిన నాలుగో టీ20లో భారత జట్టు 59 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌లో రాణించిన టీమిండియా ఆ తర్వాత బౌలింగులోనూ ప్రత్యర్థిని బెంబేలెత్తించి విజయాన్ని అందుకుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో మూడో మ్యాచ్‌ను కైవసం చేసుకున్న భారత జట్టు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగుల భారీ స్కోరు సాధించింది.

192 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆతిథ్య విండీస్ జట్టు మరో 5 బంతులు మిగిలి ఉండగానే 132 పరుగులకు కుప్పకూలి ఓటమి పాలైంది. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ మూడు వికెట్లు తీసుకోగా, అవేశ్ ఖాన్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్ తలా రెండు వికెట్లు తీసుకున్నారు. విండీస్ బ్యాటర్లలో కెప్టెన్ నికోలస్ పూరన్, రోవ్‌మన్ పావెల్ చెరో 24 పరుగులు చేశారు. హెట్మెయిర్ 19 పరుగులు చేశారు. మిగతా వారిలో ఎవరూ చెప్పుకోదగ్గ రీతిలో బ్యాట్ ఝళిపించలేకపోయారు. 

అంతకుముందు భారత టాపార్డర్ రాణించడంతో భారీ స్కోరు సాధించగలిగింది. పంత్ 44 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, కెప్టెన్ రోహిత్‌శర్మ 33, సూర్యకుమార్ యాదవ్ 24, దీపక్ హుడా 21, సంజు శాంసన్ 30 (నాటౌట్), అక్షర్ పటేల్ 20 (నాటౌట్) పరుగులు చేశారు. అవేశ్‌ఖాన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. సిరీస్‌లో చివరి మ్యాచ్ నేడు జరగనుంది. ఈ మ్యాచ్‌కు కూడా ఫ్లోరిడానే ఆతిథ్యమివ్వనుంది.

More Telugu News