Team India: స‌త్తా చాటిన టీమిండియా అమ్మాయిలు... కామ‌న్వెల్త్‌లో ఫైనల్ చేరిన ఇండియా

  • 61 ప‌రుగుల‌తో రాణించిన స్మృతి మందాన‌
  • 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 164 ప‌రుగులు చేసిన భార‌త్‌
  • ఛేజింగ్‌లో 160 ప‌రుగులే చేసిన ఇంగ్లండ్‌
  • రెండో సెమీస్‌లో గెలిచే జ‌ట్టుతో ఫైన‌ల్ ఆడ‌నున్న టీమిండియా
indian women cricket team enters in to finals of Commonwealth Games 2022

కామ‌న్వెల్త్ గేమ్స్‌లో ఇత‌ర క్రీడాకారుల మాదిరిగా టీమిండియా మ‌హిళా క్రికెట్ జ‌ట్టు కూడా స‌త్తా చాటింది. కామ‌న్వెల్త్ గేమ్స్‌లో మ‌హిళ‌ల క్రికెట్‌కు ఎంట్రీ ద‌క్కిన తొలిసారే టీమిండియా జ‌ట్టు ఫైన‌ల్ చేరింది. వెర‌సి భార‌త్‌కు మ‌రో ప‌త‌కాన్ని ఖాయం చేసింది. శ‌నివారం జ‌రిగిన సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జ‌ట్టును టీమిండియా చిత్తు చేసింది.

మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 164 ప‌రుగుల స్కోరు చేసింది. భార‌త బ్యాట‌ర్ల‌లో స్టార్ ప్లేయ‌ర్ స్మృతి మందాన 61 ప‌రుగులతో రాణించగా..జెమిమా రోడ్రిగ్జ్ 44 ప‌రుగులు చేసింది. దీప్తి శ‌ర్మ 22 ప‌రుగులు, హ‌ర్మ‌న్‌ప్రీత్ 20 ప‌రుగులు చేసింది. వెర‌సి 5 వికెట్ల న‌ష్టానికి టీమిండియా 164 ప‌రుగులు చేసి ప్ర‌త్య‌ర్థి జ‌ట్టుకు 165 ప‌రుగుల విజ‌య‌ల‌క్ష్మాన్ని నిర్దేశించింది.

ఆ త‌ర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 160 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగింది. ఇంగ్లండ్ బ్యాట‌ర్ల‌లో స్కీవెర్‌ 41 ప‌రుగులు చేయ‌గా... వ్యాట్ 35, జోన్స్ 31 ప‌రుగులు చేసింది. మిగిలిన బ్యాట‌ర్లు పెద్ద‌గా రాణించ‌లేక‌పోయారు. భార‌త బౌల‌ర్ల‌లో స్నేహ్ రాణా 2 వికెట్లు తీయ‌గా... దీప్తి శ‌ర్మ ఓ వికెట్ తీసుకుంది. ఫ‌లితంగా ఇంగ్లండ్‌పై జ‌య‌కేత‌నం ఎగుర‌వేసిన టీమిండియా రెండో సెమీస్‌లో నెగ్గే జ‌ట్టుతో ఫైన‌ల్ మ్యాచ్ ఆడ‌నుంది.

More Telugu News