Vangalapudi Anitha: తమ పార్టీ ఎంపీని రాష్ట్రంలోని మహిళలంతా ఛీ కొడుతుంటే తీరిగ్గా లేఖ రాశారు: వాసిరెడ్డి పద్మపై వంగలపూడి అనిత ఫైర్

  • ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో కాల్ దుమారం
  • విచారణ కోరుతూ డీజీపీకి లేఖ రాసిన వాసిరెడ్డి పద్మ
  • సీఎం జగన్ ను కాపాడేందుకే లేఖ రాశారన్న అనిత
  • మహిళలను వంచనకు గురిచేస్తున్నారంటూ ఆగ్రహం
Vangalapudi Anitha fires on Vasireddy Padma

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో కాల్ వ్యవహారంలో విచారణ జరపాలంటూ ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ రాష్ట్ర డీజీపీకి లేఖ రాయడం తెలిసిందే. దీనిపై టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత మండిపడ్డారు. వాసిరెడ్డి పద్మ గతంలో అకారణంగా చంద్రబాబుకు నోటీసులు ఇచ్చి మహిళా కమిషన్ ముందు హాజరు కావాలని అన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రాష్ట్ర ప్రతిపక్ష నేతను నాకున్న సర్వాధికారాలతో కమిషన్ ముందు హాజరుకమ్మని ఆదేశించాను అన్న ఈవిడ ఇప్పుడు అదే విధంగా తమ పార్టీ డర్టీ ఎంపీని తన ముందు తక్షణమే హాజరుకావాలని ఎందుకు అనలేదు? అని అనిత ప్రశ్నించారు. 

'ఇప్పుడు తమ పార్టీ ఎంపీ అడ్డంగా దొరికిపోయి రాష్ట్రంలో మహిళలంతా ఛీ కొడుతుంటే తీరిగ్గా రెండు రోజుల తర్వాత లేఖ రాశారట' అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. ఇది కచ్చితంగా చిత్తశుద్ధితో చేసిన చర్య కాదంటూ వాసిరెడ్డి పద్మపై నిప్పులు చెరిగారు. జగన్ రెడ్డిని కాపాడేందుకు రాసిన లేఖ ఇది అంటూ అనిత విమర్శించారు. రెండ్రోజులయినా ఇంకా పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించలేదని మహిళలు జగన్ రెడ్డిని ప్రశ్నిస్తుండడంతో కాలయాపన చేయడానికి వేసిన ఎత్తుగడ ఇది అని ఆరోపించారు. 

రెండ్రోజులుగా ప్రతిపక్షంలోని మహిళలు అందరూ మహిళా కమిషన్ నిర్లిప్తతను ఎండగడుతుంటే గత్యంతరంలేక నేడు విచారణ జరపాలంటూ నింపాదిగా ప్రభుత్వానికి లేఖ రాశారని మండిపడ్డారు. ఇది రాష్ట్ర మహిళలను నయవంచనకు గురిచేయడమేనని అని విమర్శించారు.

More Telugu News