Mehbooba Mufti: త్రివర్ణ పతాకాన్ని కాషాయ పతాకంగా మార్చాలనుకుంటున్నారు: మెహబూబా ముఫ్తీ

BJP trying to change Tri colour flag to Safran flag says Mehbooba Mufti
  • ఆర్టికల్ 370ని రద్దు చేసి నిన్నటితో మూడేళ్లు పూర్తి
  • రాజ్యాంగం, సెక్యులరిజంలను కూడా బీజేపీ నాశనం చేస్తుందన్న ముఫ్తీ
  • మళ్లీ అధికారంలోకి వస్తే కశ్మీర్ సమస్యను పరిష్కరించాలని ఒత్తిడి తెస్తామని వ్యాఖ్య
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ మండిపడ్డారు. మన జాతీయ జెండా అయిన త్రివర్ణ పతాకాన్ని కాషాయ పతాకంగా మార్చేందుకు బీజేపీ యత్నిస్తోందని ఆమె విమర్శించారు. భారత రాజ్యాంగ పునాదులను, సెక్యులరిజంను కూడా బీజేపీ నాశనం చేస్తుందని దుయ్యబట్టారు. భారత్ ను మతపరమైన దేశంగా మార్చాలనుకుంటోందని అన్నారు. జమ్మూకశ్మీర్ కు ఉన్న ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేక ప్రతిపత్తి, ప్రత్యేక జెండాను తొలగించిన విధంగానే... త్రివర్ణ పతాకాన్ని కూడా మార్చేస్తారని చెప్పారు. ఆర్టికల్ 370ని రద్దు చేసి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా మెహబూబా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

తాము మళ్లీ అధికారంలోకి వస్తే జమ్మూకశ్మీర్ రాజ్యాంగాన్ని, ప్రత్యేక ప్రతిపత్తిని వెనక్కి తీసుకొస్తామని మెహబూబా తెలిపారు. కశ్మీర్ కోసం లక్షలాది మంది ప్రాణాలను త్యాగం చేశారని... తాము అధికారంలోకి వస్తే కశ్మీర్ సమస్యను పరిష్కరించాలని ఒత్తిడి తెస్తామని చెప్పారు. 2019 ఆగస్ట్ 5వ తేదీన ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జమ్మూకశ్మీర్ ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టింది. అసెంబ్లీ కలిగిన యూటీగా జమ్మూకశ్మీర్ ను, అసెంబ్లీ లేని యూటీగా లడఖ్ ను ఏర్పాటు చేసింది.
Mehbooba Mufti
PDP
Jammu And Kashmir
National Flag
Article 370
BJP

More Telugu News