Telangana: రెండు గదులున్న రేకుల ఇంటికి 20 రోజులకు రూ. 88 వేల కరెంటు బిల్లు.. ఇల్లు అమ్మినా అంతరాదంటున్న యజమాని

Rs 88 thousnd current bill for two bulbs home in nalgonda dist
  • నల్గొండ జిల్లా చింతలపల్లిలో ఘటన
  • ఒక ఇంటికి రూ. 87 వేలు, మరో ఇంటికి రూ. 88 వేల విద్యుత్ బిల్లు
  • నెలనెలా రీడింగ్ తీయకపోవడం వల్లే సమస్య అన్న ఏఈ
  • సమస్య పరిష్కరిస్తామని హామీ
తెలంగాణలోని నల్గొండ జిల్లా చింతలపల్లిలో రెండు గదులున్న ఓ రేకుల ఇంటికి ఏకంగా రూ. 88 వేలకు పైగా కరెంటు బిల్లు రాగా, మరో ఇంటికి రూ. 87 వేలకు పైగా బిల్లు వచ్చింది. అది చూసిన యజమానులకు గుండె ఆగినంత పనైంది. అది కూడా 20 రోజులకే అంత పెద్దమొత్తంలో బిల్లు రావడం గమనార్హం. బిల్లులు చూసిన ఇంటి యజమానులు తమ ఇళ్లు అమ్మినా ఆ బిల్లును చెల్లించలేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

చింతపల్లికి చెందిన నల్లవెళ్లి పుల్లయ్య ఇంటికి గత నెల 16  నుంచి ఈ నెల 5 వరకు రీడింగ్ తీయగా 8,672 యూనిట్లు తిరిగినట్టు రాగా మొత్తంగా రూ. 87,338 బిల్లును పుల్లయ్య చేతికి ఇచ్చారు ఎలక్ట్రిక్ సిబ్బంది. అలాగే, నల్లవెళ్లి నిరంజన్ ఇంటికి కూడా దాదాపు ఇంతే బిల్లు వచ్చింది. 20 రోజుల్లో 8,793 యూనిట్లు తిరిగినట్టు నమోదు కాగా, అందుకు గాను రూ. 88,368 బిల్లు వచ్చింది. ఇంతా చేస్తే ఆ ఇంట్లో ఉన్నది రెండు బల్బులు, ఒక ఫ్యాన్ మాత్రమే.

దళితులకు ఉచిత విద్యుత్ అంటూ ఏళ్ల తరబడి రీడింగ్ తీయకుండా ఇప్పుడొచ్చి వేలకువేల బిల్లు చేతిలో పెడితే ఎలా? అని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది నెలనెలా రీడింగ్ తీయకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని, సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని ఏఈ తెలిపారు.
Telangana
Nalgonda District
Chinthalapally
Current Bill

More Telugu News