Tejas: మలేసియాకు తేజస్ యుద్ధ విమానాలు... భారత్ ఆఫర్

  • సొంతంగా యుద్ధ విమానం రూపొందించిన భారత్
  • తేజస్ పై పలు దేశాల ఆసక్తి
  • తేలికపాటి విమానంగా పేరుగాంచిన తేజస్
  • సింగిల్ ఇంజిన్ సహితం 
India offers Tejas LCVs to Malaysia

ఆయుధాల తయారీలో స్వావలంబన కోసం భారత్ ఎంతగానో కృషి చేస్తోంది. గత కొన్నేళ్లుగా దేశీయ ఆయుధ తయారీ రంగం గణనీయమైన స్థాయిలో పురోగతి సాధించింది. కీలక సాంకేతిక పరిజ్ఞానాలను సముపార్జించుకోవడమే కాదు, సొంతంగానూ ఆయుధాలను రూపొందిస్తూ ప్రపంచదేశాలను ఆకర్షిస్తోంది. ఈ విధంగా రూపుదిద్దుకున్నదే తేజస్ యుద్ధ విమానం. 

ఈ తేలికపాటి పోరాట విమానాన్ని భారత్ పలు దేశాలకు విక్రయించేందుకు సన్నాహాలు చేస్తోంది. తాజాగా 18 తేజస్ యుద్ధ విమానాలను విక్రయిస్తామంటూ మలేసియాకు ఆఫర్ ఇచ్చింది. తేజస్... లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ (ఎల్సీవీ) కేటగిరీకి చెందిన సింగిల్ ఇంజిన్ యుద్ధ విమానం. 1983లోనే ఈ ప్రాజెక్టుకు పునాది పడినా, ఇన్నాళ్లకు దేశీయ యుద్ధ విమానం రూపుదిద్దుకుంది. 

దీన్ని వాణిజ్య ప్రాతిపదికన ఉత్పత్తి చేసేందుకు హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్)కు రూ.4.75 లక్షల కోట్ల భారీ కాంట్రాక్టును అప్పగించింది. ఈ ఒప్పందం ప్రకారం 83 తేజస్ ఎల్సీవీలు తయారుచేయాల్సి ఉంటుంది. వీటి డెలివరీలను వచ్చే ఏడాది ప్రారంభించనున్నారు. 

తాజాగా మలేసియాకు ఆఫర్ ఇచ్చినట్టు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అంతేకాదు, మన తేజస్ యుద్ధ విమానంపై అమెరికా, ఆస్ట్రేలియా, ఈజిప్ట్, అర్జెంటీనా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ దేశాలు కూడా ఆసక్తిగా ఉన్నాయని తెలిపింది. ఈ మేరకు కేంద్ర రక్షణ శాఖ సహాయమంత్రి అజయ్ భట్ పార్లమెంటులో లిఖితపూర్వకంగా తెలియజేశారు. భారత్ అధునాతన స్టెల్త్ యుద్ధ విమాన తయారీ కోసం కృషి చేస్తోందని ఆయన వెల్లడించారు. అయితే, జాతీయ భద్రత కారణాల రీత్యా ఈ ప్రాజెక్టు గడువు, ఇతర వివరాలు చెప్పేందుకు నిరాకరించారు.

More Telugu News