Chinthakayala Vijay: వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై చింతకాయల విజయ్ రూ. 50 లక్షల పరువు నష్టం దావా

Chinthakayala Vijay sends legal notice to Gorantla Madhav
  • న్యూడ్ వీడియో విడుదల వెనుక విజయ్ ఉన్నాడన్న గోరంట్ల మాధవ్
  • వీడియోను మార్ఫింగ్ చేయడం సాధ్యమా అన్న విజయ్
  • ఆయన నగ్న వీడియోలు చూడ్డానికే మేము బతికున్నామా? అని ప్రశ్న
వైసీపీ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ పై టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ పరువు నష్టం దావా వేస్తున్నారు. తన పరువుకు భంగం కలిగించారంటూ రూ. 50 లక్షల పరువు నష్టం దావా వేయనున్నారు. దీనికి సంబంధించి తన లాయర్ ద్వారా ఆయనకు లీగల్ నోటీసు పంపించారు. లీగల్ నోటీసుకు వారం రోజుల్లోగా సమాధానం చెప్పాలని నోటీసులో ఆయన పేర్కొన్నారు.    

ఒక మహిళతో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడారంటూ గోరంట్ల మాధవ్ కు సంబంధించి ఒక వీడియో కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే, అది మార్ఫింగ్ వీడియో అని, ఆ వీడియో బయటకు రావడం వెనుక చింతకాయల విజయ్ పాత్ర ఉందని నిన్న గోరంట్ల మాధవ్ మండిపడ్డారు. 

ఈ నేపథ్యంలో విజయ్ మాట్లాడుతూ... ఆయన నగ్న వీడియోతో తనకేం సంబంధమని ప్రశ్నించారు. ఆ వీడియోను మార్ఫింగ్ చేయడం సాధ్యమయ్యే పనేనా? అని ప్రశ్నించారు. ఆయన ఇంట్లోని బ్యాక్ గ్రౌండ్, ఇతర పరిసరాలను మార్ఫింగ్ చేయగలమా? అని అడిగారు. అడ్డంగా దొరికిపోయి, మార్ఫింగ్ చేశారంటూ అబద్ధాలు చెపుతున్నారని అన్నారు. 

ఆయన జిమ్ వీడియోలు చూసి తరించడానికి ఆయనేమైనా హాలీవుడ్ స్టార్ టామ్ క్రూసా? అని ప్రశ్నించారు. ఆయన నగ్న వీడియోలు చూసి తరించడానికే తాము బతికున్నామా? అని ఎద్దేవా చేశారు. సభ్య సమాజం తలదించుకునేలా నగ్న వీడియోలు చేసి... మళ్లీ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
Chinthakayala Vijay
Telugudesam
Gorantla Madhav
YSRCP
Nude Video Call

More Telugu News