40 percent stocks: 40 శాతం స్టాక్స్ సానుకూల సంకేతాలు.. మార్కెట్ల రూట్ ఎటు?

  • 200 డీఎంఏపైకి చేరిక
  • ఇది మార్కెట్ బలానికి నిదర్శమని విశ్లేషకుల అభిప్రాయం
  • కనిష్ఠాల నుంచి 14 శాతం ర్యాలీ చేసిన సూచీలు
More than 40 percent stocks in NSE500 back above 200 DMA now

స్టాక్ మార్కెట్లు కనిష్ఠాల నుంచి కోలుకున్నాయి. ఈ ఏడాది జూన్ లో కనిష్ఠ స్థాయులకు చేరిన తర్వాత నుంచి 14 శాతం ర్యాలీ చేశాయి. మూడు నెలల గరిష్ఠానికి ప్రధాన సూచీలు చేరాయి. గత కొన్ని నెలలుగా పలు అంశాలకు సంబంధించి నెలకొన్న అనిశ్చితులు, ఆందోళనల ప్రభావాన్ని మార్కెట్లు ప్రస్తుతానికి అధిగమించినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.

అమెరికాలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఫెడ్ వడ్డీ రేట్లను అధికంగా పెంచుతూ వస్తోంది. దీనివల్ల లిక్విడిటీ తగ్గి ఆర్థిక మాంద్యంలోకి అమెరికా వెళ్లిపోతుందన్న ఆందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో వడ్డీ రేట్ల పెంపు విషయంలో ఫెడ్ ఇక మీదట దూకుడుగా వెళ్లదన్న అంచనాలున్నాయి. అందుకే ఇంత కాలం భారత ఈక్విటీ మార్కెట్లలో పెద్ద ఎత్తున విక్రయాలు చేసిన విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి పెట్టుబడులతో వస్తున్నట్టు ఫండ్స్ మేనేజర్లు చెబుతున్నారు. 

కంపెనీల జూన్ త్రైమాసిక ఫలితాలు కూడా అంచనాలకు అనుగుణంగానే ఎక్కువ శాతం ఉండడం కూడా సానుకూలించినట్టు విశ్లేషణ వినిపిస్తోంది. ఆగస్ట్ 1 నాటికి ఎన్ఎస్ఈ 500లోని 216 స్టాక్స్ (43 శాతం స్టాక్స్) 200 డీఎంఏ (200 రోజుల సగటు చలనం)కి పైన క్లోజవడాన్ని ప్రస్తావిస్తున్నారు. సాధారణంగా 200 డీఎంఏ, 50డీఎంఏ పైన చేరడాన్ని సానుకూలంగానే చూస్తారు. ఈ ఏడాది జూన్ లో 14 శాతంతో ఓవర్ సోల్డ్ గా ఉన్న దశ నుంచి మెరుగుపడినట్టు తెలుస్తోంది. ఇది మార్కెట్ బలానికి నిదర్శనంగా.. తాజా బుల్ రన్ కు సంకేతంగా విశ్లేషకులు చెబుతున్నారు. 200 డీఎంఏ నుంచి 50 డీఎంఏ పైకి చేరితే మరింత సానుకూలంగా చూస్తారు.

More Telugu News