Pakistan: కోర్టులో సుదీర్ఘ న్యాయ పోరాటం.. పాకిస్థాన్‌లో పునరుద్ధరణకు రెడీ అయిన 1200 ఏళ్లనాటి పురాతన హిందూ ఆలయం

  • లాహోర్‌లో వాల్మీకి ఆలయం
  • 22 సంవత్సరాలుగా ఆక్రమించుకున్న క్రైస్తవ కుటుంబం
  • వాల్మీకులను మాత్రమే అనుమతిస్తున్న వైనం
  • కోర్టు ఆదేశాలతో ఆలయాన్ని స్వాధీనం చేసుకున్న ఈటీపీబీ
Ancient Hindu temple in Pakistan to be restored after eviction of illegal occupants

కోర్టులో సుదీర్ఘకాలంపాటు కొనసాగిన న్యాయ పోరాటం తర్వాత పాకిస్థాన్‌లో 1200 సంవత్సరాల పురాతనమైన హిందూ ఆలయం పూర్తిస్థాయిలో తెరుచుకోబోతోంది. లాహోర్‌లో ఉన్న ఈ ఆలయాన్ని ఆక్రమించుకున్న క్రైస్తవ కుటుంబం నుంచి దానిని చేజిక్కించుకున్నామని, పూర్తిస్థాయిలో పునరుద్ధరిస్తామని పాకిస్థాన్‌లో మైనారిటీ ప్రార్థనా స్థలాలను పర్యవేక్షిస్తున్న ఫెడరల్ బాడీ ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డ్ (ETPB) తెలిపింది. 

లాహోర్‌లో ప్రసిద్ధి చెందిన అనార్కలి బజార్‌ సమీపంలో ఉన్న వాల్మీకి ఆలయాన్ని క్రైస్తవ కుటుంబం నుంచి గత నెలలో బోర్డు స్వాధీనం చేసుకుంది. లాహోర్‌లోని కృష్ణుడి ఆలయంలోపాటు వాల్మీకి ఆలయం కూడా ప్రస్తుతం భక్తులకు అందుబాటులో ఉంది. 

అయితే, క్రైస్తవం నుంచి హిందూమతంలోకి మారినట్టుగా చెబుతున్న ఓ కుటుంబం.. వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన వారిని మాత్రమే గత రెండు దశాబ్దాలుగా ఈ ఆలయంలోకి అనుమతి ఇస్తోంది. త్వరలోనే ఈ ఆలయాన్ని పునరుద్ధరించి అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని ఈటీపీబీ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. వందమందికిపైగా హిందువులు, సిక్కులు, క్రైస్తవ నేతలు ఈ ఆలయం వద్ద సమావేశమయ్యారని, హిందువులు తమ మతపరమైన ఆచారాలను ఆలయంలో నిర్వహించారని పేర్కొన్నారు. 

ఈ ఆలయం 22 సంవత్సరాలుగా క్రైస్తవ కుటుంబం చేతిలో మగ్గిపోయింది. ఆలయ స్థలం తమదేనంటూ 2010-11లో కోర్టులో కేసు వేసింది. దీంతో అప్పటి నుంచి న్యాయపోరాటం జరుగుతూనే ఉంది. తాజాగా, ఈటీపీబీకి అనుకూలంగా తీర్పు రావడంతో ఆలయాన్ని ఆక్రమించుకున్న క్రైస్తవ కుటుంబాన్ని అక్కడి నుంచి వెళ్లగొట్టి ఆలయాన్ని స్వాధీనం చేసుకున్నారు.

More Telugu News