Shabbir Ali: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కోట్ల అప్పులు ఉన్నాయి.. ఆయనొక డిఫాల్టర్: షబ్బీర్ అలీ

  • కాంగ్రెస్ కు రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో వేడెక్కిన రాజకీయాలు
  • బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య పేలుతున్న మాటల తూటాలు
  • కాంగ్రెస్ ను విమర్శించే స్థాయి రాజగోపాల్ రెడ్డికి లేదన్న షబ్బీర్
Komatireddy Raj Gopal Reddy is a defaulter says Shabbir Ali

కాంగ్రెస్ పార్టీకి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ బ్రాండ్ లేకపోతే బ్రాందీ షాపుల్లో పని చేసేవారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. తనను రెచ్చగొట్టొద్దు అంటూ రేవంత్ కు వార్నింగ్ ఇచ్చారు. 

మరోవైపు రాజగోపాల్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజగోపాల్ రెడ్డి తనకు పీసీసీ పదవి ఇవ్వాలని అడిగారని... తన అన్న వెంకట్ రెడ్డికి ఇవ్వొద్దన్నారని చెప్పారు. ఒక రోజు రాజగోపాల్ రెడ్డి తన ఇంటికి వచ్చారని... పీసీసీ పదవికి ప్రపోజ్ చేయమని తనను అడిగారని తెలిపారు. ఇది నిజమో, కాదో ఒట్టేసి చెప్పాలని సవాల్ విసిరారు.

కాంగ్రెస్ పార్టీ పాలు తాగి వెన్నుపోటు పొడిచారని షబ్బీర్ అలీ మండిపడ్డారు. ఎన్నో కాంట్రాక్టులు చేసిన రాజగోపాల్ రెడ్డికి కోట్ల అప్పులు ఉన్నాయని, ఆయన డిఫాల్టర్ గా మారారని... ఈ సమస్యల నుంచి బయటపడేందుకే ఆయన అమిత్ షాను కలిశారని చెప్పారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ఏ రోజైనా మునుగోడుకు వెళ్లావా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీని, పీసీసీ చీఫ్ ను విమర్శించే స్థాయి నీకు లేదని అన్నారు.

More Telugu News