Nancy Pelosi: చైనా హెచ్చరికను బేఖాతరు చేస్తూ తైవాన్ లో అడుగుపెట్టిన నాన్సీ పెలోసీ

Nancy Pelosi arrives Taipe amidst China warnings
  • ఆసియాలో పర్యటిస్తున్న అమెరికా చట్టసభ స్పీకర్
  • మలేసియా నుంచి తైవాన్ వచ్చిన నాన్సీ పెలోసీ
  • ఇప్పటికే హెచ్చరికలు చేసిన చైనా
  • డ్రాగన్ బెదిరింపులను లెక్కచేయని అమెరికా
ఆసియాలో పర్యటిస్తున్న అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ చేరుకున్నారు. ఆమెకు తైపే ఎయిర్ పోర్టులో ఘనస్వాగతం లభించింది. పెలోసీ తైవాన్ లో పర్యటిస్తే అమెరికా తగిన మూల్యం చెల్లించుకుంటుందని చైనా ఘాటు హెచ్చరిక చేసిన నేపథ్యంలో ఆమె తైపేలో అడుగుపెట్టడం గమనార్హం. 

కాగా, మలేసియా నుంచి పెలోసీ ప్రయాణిస్తున్న విమానం తైవాన్ గగనతలంలోకి ప్రవేశించగానే, తైవాన్ యుద్ధ విమానాలు ఎస్కార్ట్ గా వచ్చాయి. చైనా నుంచి ముప్పు ఉండొచ్చన్న నేపథ్యంలో, ఆమె ప్రయాణిస్తున్న విమానం తైపే ఎయిర్ పోర్టులో ల్యాండయ్యేంత వరకు రక్షణ కల్పించాయి. 

అమెరికా చట్టసభ స్పీకర్ హోదాలో తైవాన్ లో నాన్సీ పెలోసీ పర్యటనకు చాలా ప్రాధాన్యం ఉంది. గత 25 ఏళ్లలో అమెరికా అత్యున్నత స్థాయి ప్రజాప్రతినిధి ఒకరు తైవాన్ లో పర్యటించడం ఇదే ప్రథమం. 

కాగా, నాన్సీ పెలోసీ ఇవాళ ప్రయాణించిన విమానం రూట్ ను ప్రపంచ దేశాలు ఉత్కంఠగా గమనించాయి. ఎందుకంటే, చైనా హెచ్చరికల నేపథ్యంలో ఆమె విమానం తైవాన్ వెళుతుందా? లేక మరే దేశం వైపు అయినా మళ్లిస్తారా? అనే ఆసక్తి నెలకొంది. అగ్రరాజ్యం అమెరికా డ్రాగన్ బెదిరింపులకు భయపడకుండా తైవాన్ వెళ్లేందుకు పెలోసీకి పచ్చజెండా ఊపింది. ఈ నేపథ్యంలో, చైనా స్పందన ఎలా ఉంటుందన్న దానిపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది.
Nancy Pelosi
Taipe
Taiwan
USA
China

More Telugu News