Andhra Pradesh: టీడీపీ వారికి రోడ్లు ఎలా వేస్తాం?... 'గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు'లో అంబ‌టి ఎదురు ప్ర‌శ్న‌!

  • రాజుపాలెంలో గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం
  • స్వ‌యంగా పాల్గొన్న మంత్రి అంబ‌టి రాంబాబు
  • మూడేళ్లుగా పింఛ‌న్ రాలేద‌న్న దివ్యాంగురాలు
  • నిల‌దీత‌ల‌తో కార్య‌క్ర‌మాన్ని మ‌ధ్య‌లోనే ముగించిన మంత్రి
  • మీడియా ప్ర‌తినిధుల ఫోన్ల‌లో వీడియోల‌ను తొల‌గించిన మంత్రి పీఏ
ap minister ambati rambabu fires on complaints in gadapagadapaku programme

ఏపీ జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రి అంబ‌టి రాంబాబు చేప‌ట్టిన గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న‌కు ప్ర‌జ‌ల నుంచి ప‌లు అంశాల‌పై ప్ర‌శ్న‌లు ఎదురయ్యాయి. అయితే వాటికి మంత్రి అంబ‌టి కూడా ఎదురు ప్ర‌శ్న‌లు సంధిస్తూ ముందుకు సాగిపోయిన వైనం ఆస‌క్తి రేకెత్తిస్తోంది. 

ప‌ల్నాడు జిల్లా ప‌రిధిలోని స‌త్తెన‌ప‌ల్లి ఎమ్మెల్యేగా కొన‌సాగుతున్న అంబ‌టి... సోమ‌వారం గ‌డ‌ప‌గ‌డ‌ప‌కులో భాగంగా నియోజ‌కవ‌ర్గ ప‌రిధిలోని రాజుపాలెంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఓ వ్య‌క్తి త‌మ ప్రాంతంలో రోడ్లు వేయాలంటూ మంత్రిని కోరారు. ఈ ప్ర‌శ్న‌కు వెనువెంట‌నే స్పందించిన అంబ‌టి... టీడీపీ వారికి రోడ్లు ఎలా వేస్తామంటూ ఎదురు ప్ర‌శ్న సంధించారు. మంత్రి పర్యటనకు సంబంధించిన వీడియోను టీడీపీ తన అధికారిక ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

అంత‌కుముందు అదే గ్రామంలో ప‌లువురు మంత్రి అంబ‌టిని నిల‌దీశారు. దివ్యాంగురాలిని అయిన తాను మూడేళ్లుగా పింఛ‌న్ కోసం ఎదురు చూస్తున్నా... త‌న‌కు ఫ‌లితం ద‌క్క‌లేద‌ని ఓ మహిళ మంత్రికి తెలిపారు. అక్క‌డే ఉన్న అధికారుల‌ను ఆరా తీయ‌గా.. 4 విద్యుత్ మీట‌ర్లు ఉన్న కార‌ణంగా ఆమెకు పింఛ‌న్ రాలేద‌ని అధికారులు తెలిపారు. 

దీంతో ఈ కార‌ణంగానే మీకు పింఛ‌న్ రాలేద‌ని చెప్పి మంత్రి అక్క‌డి నుంచి ముందుకు క‌ద‌ల‌గా... బుల్ల‌బ్బాయి అనే వ్య‌క్తి వైసీపీ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు ఏమీ చేయ‌డం లేద‌ని అన్నారు. ఇలా వ‌రుస‌బెట్టి నిల‌దీత‌లు ఎదురుకాగా అంబ‌టి కార్యక్ర‌మాన్ని అప్ప‌టిక‌ప్పుడు ముగించుకుని వెళ్లిపోయారు. ఈ సంద‌ర్భంగా ఈ విష‌యాల‌ను మీడియా ప్ర‌తినిధులు రికార్డు చేయ‌డాన్ని గ‌మ‌నించిన అంబ‌టి పీఏ... మీడియా ప్ర‌తినిధుల ఫోన్ల‌ను తీసుకుని ఆ వీడియోల‌ను తొల‌గించారు.

More Telugu News