head bath: రోజూ తలస్నానంతో శిరోజాలకు నష్టమే అంటున్న నిపుణులు!

  • సహజ సిద్ధమైన నూనెలు, పోషకాలు మిగలవు
  • దీనివల్ల శిరోజాలు పట్టు కోల్పోతాయి
  • చర్మ తత్వం ఏదైనా సరే వారానికి ఓసారి లేదంటే రెండు సార్లు చాలు
How Often Do I Need head bath

కొందరు ప్రతి రోజూ తలస్నానం చేస్తారు. అయితే, ఇది శిరోజాలకు మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు. రెండు రోజులకు ఒకసారి కూడా పనికిరాదు. ఎందుకంటే దీనివల్ల కలిగే నష్టం ఏంటన్నది నిపుణులు తెలియజేస్తున్నారు. 

తరచుగా తలస్నానం చేయడం వల్ల కలిగే మేలు కంటే కీడే ఎక్కువన్నది నిపుణులు చెబుతున్న మాట. శిరోజాలు నిగారింపుతో కళకళలాడుతూ ఉండాలంటే తరచూ తలస్నానం చేయడాన్ని మానేయాలని సూచిస్తున్నారు. వంపులు తిరిగిన శిరోజాలు కావచ్చు. జిడ్డు తత్వం కలిగిన లేదంటే సిల్కీ హెయిర్ అయినా కావచ్చు. రోజువారీ, రెండు రోజులకోసారి చేయడం వల్ల నష్టం ఎక్కువగా ఉంటుందన్నది నిపుణులు అధ్యయన పూర్వకంగా తెలుసుకున్న విషయం.

తల చర్మంపై ఉన్న వెంట్రుక కుదుళ్లు ఫాలికల్స్ తో అనుసంధానమై ఉంటాయి. ఈ ఫాలికల్స్ మన గ్రంధులకు కనెక్ట్ అయి ఉంటాయి. వాటి నుంచే కావాల్సిన విటమిన్లు, తేమ మన తల వెంట్రుకలకు అందుతాయి. సెబమ్ అనే సహజసిద్ధమైన నూనె వెంట్రుకల కోసం ఉత్పత్తి అవుతుంది. మరి తరచూ తల స్నానం చేయడం వల్ల మన శరీరం నుంచి వెంట్రుకలకు సహజంగా అందే పోషకాలు, ఆయిల్స్ నీటితో వెళ్లిపోతాయి. దీనివల్ల వెంట్రుకలకు నష్టం కలుగుతుంది. పైగా నేడు వాడే షాంపూలు ప్రభావవంతమైన కెమికల్స్ తో ఉంటున్నాయి. వీటి వల్ల అన్ని పోషకాలు పోయి చర్మం పొడిబారుతుంది. చుండ్రు, దురద కూడా వస్తాయి. శిరోజాలు రాలిపోతాయి.

అవసరమైనప్పుడే తలస్నానం చేయాలన్నది నిపుణులు ఇచ్చే సలహా. చేతి వేళ్లతో తల వెంట్రుకలను పట్టుకుంటే సాఫ్ట్, బౌన్సీగా ఉంటే తలస్నానం అవసరం లేదని అర్థం. సాధారణంగా చెప్పుకోవాలంటే కొంత మందికి వారానికి ఒకసారే అవసరం పడొచ్చు. కొందరికి వారంలో రెండు సార్లు. తలస్నానం చేయకపోతే అసౌకర్యంగా అనిపిస్తే కనీసం మూడు రోజులకు ఒక పర్యాయం చేయవచ్చు. కానీ, నిత్యం తలంటు పోసుకోవద్దన్నది నిపుణుల సూచన.

More Telugu News