West Bengal: పశ్చిమ బెంగాల్‌లో విషాదం: కన్వర్ యాత్రికులు ప్రయాణిస్తున్న ట్రక్‌కు విద్యుదాఘాతం.. 10 మంది మృతి

  • జనరేటర్ వైరింగే కారణమని ప్రాథమికంగా తేల్చిన పోలీసులు
  • తీవ్రంగా గాయపడిన మరో 19 మంది
  • ట్రక్కులో జల్పేష్ వెళ్తుండగా ఘటన
10 kanwariyas dead due to electrocution in Cooch Behar

పశ్చిమ బెంగాల్‌లోని కూచ్ బెహార్‌లో గత అర్ధరాత్రి విషాదం చోటుచేసుకుంది. కన్వర్ యాత్రికులతో జల్పేష్ వెళ్తున్న ట్రక్కులో విద్యుదాఘాతం కారణంగా 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 19 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, తీవ్రంగా గాయపడిన 16 మందిని మరింత మెరుగైన చికిత్స కోసం జల్పాయ్‌గురి జిల్లా ఆసుపత్రికి తరలించారు. పదిమంది మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. వాహనంలోని డీజే సిస్టం కోసం ఏర్పాటు చేసిన జనరేటర్ వైరింగ్ కారణంగానే విద్యుదాఘాతం సంభవించినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు.

మేఖ్లిగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధార్లా బ్రిడ్జ్ వద్ద ఈ ఘటన జరిగినట్టు మఠభంగ అడిషనల్ ఎస్పీ అమిత్ వర్మ తెలిపారు. జనరేటర్ వైరింగ్ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తేలిందన్నారు. కన్వారియాలందరూ శీతల్‌కుచి పోలీస్ పరిధిలోని ప్రాంతానికి చెందిన వారని పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్టు తెలిపారు. వాహనాన్ని సీజ్ చేశామని, డ్రైవర్ పరారీలో ఉన్నాడన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

More Telugu News