Earth: 24 గంటల కంటే తక్కువ సమయంలోనే తన చుట్టూ తాను తిరిగిన భూమి... సరికొత్త రికార్డు

  • వేగం పుంజుకున్న భూమి
  • జులై 29న ఘటన
  • 1.59 మిల్లీసెకన్ల తేడాతో భ్రమణం పూర్తి
  • 1960 నాటి రికార్డు తెరమరుగు
Earth creates new record in single day revelation

భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటల సమయం పడుతుందని, దాన్ని ఒక రోజు అని పిలుస్తామని తెలిసిందే. అయితే, భూభ్రమణం విషయంలో ఇప్పుడో సరికొత్త రికార్డు నమోదైంది. భూమి 24 గంటల కంటే తక్కువ సమయంలోనే తన చుట్టూ తాను తిరిగినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. 24 గంటలకు 1.59 మిల్లీసెకన్ల సమయం తక్కువగా భూమి తన భ్రమణాన్ని పూర్తిచేసిందట. ఇది జులై 29న సంభవించిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. 

1960లో జులై 19న భూమి 24 గంటల కంటే 1.47 మిల్లీ సెకండ్ల తక్కువ సమయంతో భ్రమణం పూర్తిచేసింది. ఇప్పటివరకు ఇదే రికార్డుగా ఉంది. అయితే, తాజాగా 1.59 మిల్లీసెకన్ల తేడాతో భూమి తనను తాను చుట్టేసి సరికొత్త రికార్డు నమోదు చేసింది. 

కాగా, భూభ్రమణంలో ఈ వేగం భౌగోళిక ధ్రువాల కదలికలకు సంబంధించిన అంశమని పరిశోధకులు చెబుతున్నారు. దీన్ని 'చాండ్లర్ వొబుల్' అంటారని లియోనిడ్ జోటోవ్, క్రిస్టియన్ బిజౌర్డ్, నికోలాయ్ సిడోరెంకోవ్ అనే శాస్త్రవేత్తలు వెల్లడించారు. 

సరిగ్గా చెప్పాలంటే బొంగరం తిరగడం ప్రారంభించినప్పుడు ఎలా వేగం పుంజుకుంటుందో, ఆ తర్వాత నెమ్మదించినప్పుడు క్రమంగా వేగం తగ్గిపోతుందని, భూమి కూడా ఈ తరహాలోనే ఒక్కోసారి వేగం పుంజుకుంటుందని  వారు వివరించారు. ఇటీవల కాలంలో భూమి తన చుట్టూ తాను తిరిగే వేగంలో పెరుగుదల కనిపిస్తోందని వివరించారు.

More Telugu News