Samsung: శామ్ సంగ్ ఫోన్లలో కొత్తగా ‘రిపేర్’ మోడ్

  • సర్వీసింగ్ ఇవ్వాల్సి వస్తే  భయపడక్కర్లేదు
  • ఫోన్లోని సమాచారాన్ని డిలీట్ చేసుకోవక్కర్లేదు
  • రిపేర్ మోడ్ ఆన్ చేస్తే కీలక డేటా కనపడకుండా ఉంటుంది
Samsung Repair Mode will hide your data in phone

శామ్ సంగ్ ఫోన్లో ఏదైనా సమస్య వచ్చి దాన్ని సర్వీసింగ్ కోసం ఇవ్వాల్సి వస్తే..? ఫోన్లోని ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు, ఇలా కీలక డేటాను జాగ్రత్త పరుచుకోవడం పెద్ద సవాలే. అవసరం లేనివి అయితే డిలీట్ కొట్టేసి ఇవ్వొచ్చు. కానీ అవసరం ఉన్నవి, ముఖ్యమైనవి కూడా ఎన్నో ఉంటాయి. మరి వాటి విషయంలో ఏం చేయాలి? కస్టమర్ల ఈ తరహా ఆందోళనలకు పరిష్కారంపై దక్షిణ కొరియా కంపెనీ శామ్ సంగ్ దృష్టి పెట్టింది. 

ఫోన్లోని యూజర్ డేటాను గోప్యంగా ఉంచేందుకు ‘రిపేర్ మోడ్’ అనే ఫీచర్ ను శాంసంగ్ అభివృద్ధి చేస్తున్నట్టు సమాచారం. శామ్ సంగ్ కొరియా వెబ్ సైట్ లో ఈ విషయం దర్శనమిచ్చింది. రీపేర్ మోడ్ లో పెట్టేసి సర్వీసింగ్ సెంటర్ లో సమర్పించిన తర్వాత.. ఫొన్లోని కీలక సమాచారాన్ని టెక్నీషియన్ చూడలేడు. అవి కనిపించకుండా పోతాయి. దీంతో ఫోన్లోని కీలక కంటెంట్ ను దుర్వినియోగం చేసే రిస్క్ కూడా ఉండదు. గెలాక్సీ ఎస్21 సిరీస్ ఫోన్లలో ఈ ఫీచర్ తీసుకొచ్చే ఆలోచనతో శామ్ సంగ్ ఉంది. ఇతర మోడళ్ల ఫోన్లకు సైతం ఈ ఫీచర్ ను విస్తరించనుంది. 

సెట్టింగ్స్ లో ‘బ్యాటరీ అండ్ డివైజ్ కేర్’ ఆప్షన్ లోకి వెళ్లిన తర్వాత అక్కడ రిపేర్ మోడ్ కనిపిస్తుంది. దీన్ని సెలక్ట్ చేసుకుంటే ఫోన్ లో రీపేర్ మోడ్ ఆన్ అవుతుంది. దీంతో ఫోన్లోని ఫొటోలు, డేటా సాంకేతికంగా కనిపించకుండా పోతుంది.

More Telugu News