Britain: 10 శాతానికి ప‌డిపోయిన సునాక్ గెలుపు అవ‌కాశాలు... గెలుపు దిశ‌గా లిజ్ ట్ర‌స్ దూకుడు

  • కొన‌సాగుతున్న బ్రిట‌న్ నూత‌న ప్ర‌ధాని ఎన్నిక‌
  • లిజ్ ట్ర‌స్‌తో రిషి సునాక్ కు తీవ్ర పోటీ
  • జ‌నాక‌ర్ష‌క ప్ర‌క‌ట‌న‌ల‌తో స‌త్తా చాటుతున్న ట్ర‌స్‌
  • సుప‌రిపాల‌న దిశ‌గా సాగుతున్న సునాక్‌
liz truss will get mojority in britain prime minister electionover rishi sunak

బ్రిట‌న్ ప్ర‌ధాన మంత్రి ప‌ద‌వి రేసులో మొన్న‌టిదాకా దూకుడుగా సాగిన భార‌త సంత‌తి నేత‌, ఆ దేశ ఆర్థిక శాఖ మాజీ మంత్రి రిషి సునాక్ తాజాగా పోటీలో బాగా వెనుక‌బ‌డిపోయిన‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌ధాని ప‌ద‌వికి చివ‌రి బ‌రిలో నిలిచిన లిజ్‌ట్ర‌స్‌... సునాక్ విజ‌యావ‌కాశాల‌ను పూర్తిగా త‌న వైపున‌కు లాగేసుకున్నార‌ట‌. ఫ‌లితంగా శ‌నివారం నాటి విశ్లేష‌ణ‌ల ప్ర‌కారం 90 శాతం విజ‌యావ‌కాశాల‌తో లిజ్ ట్ర‌స్ దూసుకుపోతుంటే... 10 శాతం గెలుపు అవ‌కాశాల‌తో సునాక్ సాగుతున్నారు.

ప‌లు వివాదాస్ప‌ద నిర్ణ‌యాల‌తో బ్రిట‌న్ ప్ర‌ధానిగా కొన‌సాగుతున్న బోరిస్ జాన్సన్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌గా... ఆయ‌న స్థానంలో కొత్త ప్ర‌ధానిని ఎన్నుకునేందుకు అధికారిక క‌న్జ‌ర్వేటివ్ పార్టీలో క్ర‌తువు మొద‌లైపోయింది. నూత‌న ప్ర‌ధానిని ఎన్నుకోవ‌డంలో క‌న్జ‌ర్వేటివ్ పార్టీ ఎంపీల‌తో పాటు ఆ పార్టీ స‌భ్యులు కూడా ఓటింగ్‌లో పాలుపంచుకోవాల్సి ఉంది. ఎంపీల్లో సునాక్‌కు మెజారిటీ క‌నిపిస్తున్నా... పార్టీ స‌భ్యుల్లో మాత్రం లిజ్ ట్ర‌స్‌కు భారీ ఆధిక్య‌త క‌నిపిస్తున్న‌ట్లు బ్రిట‌న్ బెట్టింగ్ ఎక్చేంజి సంస్థ స్మార్కెట్స్ వెల్ల‌డించింది.

బోరిస్ కేబినెట్‌లో సునాక్ ఆర్థిక మంత్రిగా వ్య‌వ‌హ‌రించ‌గా... ట్ర‌స్ విదేశాంగ మంత్రిగా వ్య‌వ‌హ‌రించారు. వెరసి ఇప్పుడు బ్రిట‌న్ నూత‌న ప్ర‌ధాని రేసులో ఆర్థిక‌, విదేశాంగ శాఖ మంత్రుల మ‌ధ్య పోటీ నెల‌కొంది. నూత‌న ప్ర‌ధాని ఎన్నిక‌ల్లో భాగంగా నిర్వ‌హిస్తున్న ముఖాముఖి చ‌ర్చ‌ల్లో భాగంగా సునాక్‌పై ట్ర‌స్ సునాయ‌సంగా ఆధిక్య‌త చాటుతున్న‌ట్లు స‌మాచారం. తాను అధికారంలోకి వ‌స్తే ప‌న్నులు త‌గ్గిస్తాన‌ని ట్ర‌స్ జ‌నాక‌ర్ష‌క ప్ర‌క‌ట‌న చేయ‌గా... ప్ర‌జ‌ల‌కు మంచి పాల‌న అందించేందుకు తాను మాత్రం ప‌న్నులు త‌గ్గించ‌బోనంటూ సునాక్ ప్రక‌టించారు. ఫ‌లితంగా పార్టీ స‌భ్యుల్లో మెజారిటీ శాతం ట్ర‌స్ వైపు మ‌ళ్లిన‌ట్టుగా స‌మాచారం.

More Telugu News