Monkeypox Virus: మంకీపాక్స్ కలకలం.. ఆఫ్రికాకు వెలుపల తొలి మృతి!

  • మంకీపాక్స్ కారణంగా బ్రెజిల్ లో 41 ఏళ్ల వ్యక్తి మృతి
  • ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 18 వేల కేసుల నమోదు
  • మే నెలలో ఆఫ్రికాలో వెలుగు చూసిన తొలి కేసు
Monkeypox first death out side Africa

ప్రపంచ వ్యాప్తంగా మంకీపాక్స్ పై ఆందోళన పెరుగుతోంది. దీన్ని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించి వారం గడవక ముందే అది క్రమంగా పలు దేశాలకు విస్తరిస్తోంది. ఈ క్రమంలో ఆఫ్రికాకు వెలుపల మంకీపాక్స్ తొలి మరణం సంభవించింది. బ్రెజిల్ లో 41 ఏళ్ల వ్యక్తి మంకీపాక్స్ కారణంగా మృతి చెందాడు. ఆగ్నేయ బ్రెజిల్ లో ఈ మరణం చోటు చేసుకుంది. 

మంకీపాక్స్ కారణంగానే సదరు వ్యక్తి మృతి చెందినట్టు స్థానిక వైద్యాధికారులు ప్రకటించారు. అతనిలో రోగ నిరోధక శక్తి అత్యంత బలహీనంగా ఉందని చెప్పారు. బ్రెజిల్ లో ఇప్పటి వరకు వెయ్యికి పైగా మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. వీటిలో సావో పాలో, రియో డీ జనీరో నగరాల్లో ఎక్కువ కేసులు వచ్చాయి. 

మే నెలలో ఆఫ్రికాలో తొలి మంకీపాక్స్ కేసు వెలుగు చూసింది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 18 వేల కేసులు నమోదయ్యాయి. 78 దేశాలల్లో మంకీపాక్స్ ను గుర్తించారు. మొత్తం కేసుల్లో 70 శాతం కేసులు యూరప్ లో, 25 శాతం కేసులు ఉత్తర, దక్షిణ అమెరికాల్లో నమోదయ్యాయి.

More Telugu News