River Godavari: గోదావరి వరదలో కొట్టుకుపోయిన వనదుర్గ ఆలయం.. వీడియో వైరల్

  • పురుషోత్తపట్నంలో ఘటన
  • 15 ఏళ్ల క్రితం వనదుర్గ ఆలయం నిర్మాణం
  • శ్రావణమాసం తొలి శుక్రవారం సందర్భంగా నిన్న పూజలు
  • అందరూ చూస్తుండగానే కొట్టుకుపోయిన ఆలయం
Vanadurga Temple in East Godavari District washed away in River Godavari

గోదావరి వరదలో ఆలయం ఒకటి కొట్టుకుపోతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలోని పురుషోత్తపట్నంలో గోదావరి నది ఒడ్డున వనదుర్గ ఆలయం ఉంది. 15 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ఆలయంలో నిత్యం పూజలు జరుగుతుంటాయి. శ్రావణమాసం తొలి శుక్రవారం కావడంతో నిన్న ఉదయం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు గోదావరికి వరద పోటెత్తడంతో ఆలయం వరకు నీరు చేరుకుంది. 

వరద తాకిడికి తీరం కోతకు గురికావడంతో మధ్యాహ్నానికే ఆలయం బీటలు వారి ఓ వైపునకు ఒరిగిపోయింది. సాయంత్రానికి ఒక్కసారిగా నదిలో పడిపోయి కొట్టుకుపోయింది. ఆలయం కొట్టుకుపోవడం ఖాయమని ముందే గ్రహించిన గ్రామస్థులు గుడిలోకి ఎవరూ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో ప్రమాదం తప్పింది. ఆలయం నదిలో పడిపోతున్న సమయంలో గ్రామస్థులు తీసిన వీడియోలు సోషల్ మీడియాకెక్కాయి.

More Telugu News