Andhra Pradesh: ఎవరు ఏ వరదలో ఏమైపోతే మనకేంటి అనుకుంటున్నారా?: ప్రభుత్వంపై చంద్రబాబు ధ్వజం

  • గోదావరి ముంపు ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలు అందడం లేదని ఆరోపణ
  • కూనవరం మండల కేంద్రంలో ఇంట్లో బురద శుభ్రం చేస్తున్న చిన్నారి
  • వీడియోను ట్విట్టర్ లో షేర్ చేసిన చంద్రబాబు
  • అన్ని చోట్లా ఇదే పరిస్థితి ఉందన్న టీడీపీ అధినేత 
TDP Chief chandrababu slams AP govt over flood reliefwork

గోదావరి ముంపు ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద వచ్చి పది రోజులు దాటినా ముంపు గ్రామాల్లో సహాయ చర్యలు సరిగ్గా చేపట్టలేదని విమర్శించారు. గోదావరి ముంపు ప్రాంతమైన కూనవరం మండల కేంద్రంలో ఓ బాధితుడి ఇంట్లో చిన్నారులు బురదను తొలగించే ప్రయత్నం చేస్తున్న వీడియోను ట్విటర్లో షేర్ చేసిన చంద్రబాబు అన్ని చోట్లా ఇదే పరిస్థితి ఉందన్నారు. ప్రజలు వరదలో ఏమైపోయినా తమకేంటి అని అనుకుంటున్నారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజలను పలుకరిస్తే సరిపోదని, వాస్తవాలు తెలుసుకొని సాయం చేయాలని సూచించారు.

‘గోదావరి ముంపు ప్రాంతమైన కూనవరం మండల కేంద్రంలో ఇళ్ల పరిస్థితి ఇది. గ్రామంలో ఓ బాధితుడు తన ఇంటిని స్వయంగా కుటుంబ సభ్యులతో కలిసి శుభ్రం చేసుకుంటున్నారు. మోకాలి వరకు పేరుకు పోయిన బురదలో ముక్కుపచ్చలారని చిన్నారులు పడుతున్న కష్టం చూస్తే బాధేస్తోంది. వరదొచ్చి పది రోజులు దాటుతున్నా ముంపు గ్రామాల్లో ప్రతి చోటా ఇదే పరిస్థితి. ఇదేనా బాధితులను ఆదుకునే తీరు? ఆ చిన్నారిని అడిగితే మీ ప్రభుత్వానికి నిజమైన మార్కులు వేస్తుంది. ఎవరు ఏ వరదలో ఏమైపోతే మనకేంటి అనుకుంటున్నారా? పరదాలు కట్టి పలకరింపులు కాదు.. వాస్తవాలు తెలుసుకోండి..సాయం చేయండి’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.

More Telugu News