Parenting: కిడ్స్ ను జెమ్స్ గా మార్చాలంటే.. అందుకు మార్గాలున్నాయ్!

  • అన్నింటికంటే ముందు ఏకాగ్రత అవసరం
  • చదవడాన్ని హాబీగా మార్చడం వల్ల మంచి ఫలితాలు
  • కొత్త అంశాలు తెలుసుకోవడాన్ని ప్రోత్సహించాలి
Parenting tips Here is how parents can shape their kids personality

చదువుల్లో బాగా రాణించాలని, సమాజంలో గొప్ప వ్యక్తిగా తమ వారసులు వెలిగిపోవాలని కోరుకోని తల్లిదండ్రులు ఉండరు. కానీ, ఆచరణలో ఇది ఏ కొద్ది మందికో సాధ్యపడుతుంది. కొందరు కేవలం తమ పిల్లలకు బాగా చదువు రావాలన్న దానిపైనే దృష్టి సారిస్తుంటారు. కొందరు తమ చిన్నారులను అన్ని రకాలుగా తీర్చిదిద్దాలని కోరుకుంటుంటారు. ఇందుకోసం కొన్నింటి విషయంలో తమ వంతుగా కృషి చేయాల్సిన అవసరం తల్లిదండ్రులపైనా ఉంటుంది.  

ఇప్పటి ఆధునిక కాలంలో పేరెంటింగ్ అన్నది క్లిష్టమైన టాస్క్ గా మారిపోయింది. మారిపోతున్న జీవన విధానాలు, మరింత చిన్నవిగా మారుతున్న కుటుంబాలు, టెక్నాలజీలో పురోగతి నేపథ్యంలో.. పిల్లలను అన్ని అంశాల్లోనూ ఉత్తములుగా తీర్చిదిద్దడం పెద్ద టాస్క్ గా మారిపోయింది. మరి ఈ విషయంలో తల్లిదండ్రులు ఎలా మసలుకుంటే, మెరుగైన ఫలితాలను ఆశించవచ్చో నిపుణులు సూచిస్తున్నారు.

ఏకాగ్రత
నేడు పిల్లల ఏకాగ్రతను దెబ్బతీసే అంశాలు ఎక్కువైపోయాయి. స్మార్ట్ ఫోన్లు, టీవీలతో మరింత నష్టం కలుగుతోంది. వీటి కారణంగా పిల్లల్లో ఆసక్తులు, ఏకాగ్రతకు నష్టం కలుగుతోంది. తల్లిదండ్రులు బలవంతంగా తమ పిల్లల్లో సానుకూలత జొప్పించేందుకు ప్రయత్నించకూడదు. పిల్లల కోరికలు, వారి బలాలను అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా వారిలోని ఆసక్తులను తెలుసుకోవడం ఎంతో అవసరం. వారికి ఆసక్తి ఉన్న వాటి విషయంలో సాయం చేయాలి. ప్రోత్సాహం అందించాలి. అప్పుడు వారిలో విశ్వాసం పెరుగుతుంది. ఏకాగ్రత కూడా పెరుగుతుందని నిపుణుల సూచన. 

చదివే అలవాటు
పిల్లలకు రీడింగ్ ను ఓ అలవాటుగా చేస్తే మంచి ఫలితాలు వస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. మొబైల్, వీడియో గేమ్ లు ఎక్కువైపోయాయి. దీనివల్ల పుస్తక పఠనం అలవాటు పిల్లల్లో కనిపించడం లేదు. చదివే అలవాటు వల్ల పిల్లలో సానుకూల దృక్పథం, తార్కికత, ఆలోచనా తత్వం బలపడతాయి. పిల్లలు అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని కోరుకుంటే వారికి నేర్పించాల్సిన వాటిల్లో పుస్తక పఠనం కూడా ఒకటి. దీనివల్ల వారికి భాషా పాండిత్యం బలపడుతుంది. కమ్యూనికేషన్ నైపుణ్యాలు కూడా బలోపేతం అవుతాయి. 

కొత్తవాటి పట్ల ఆసక్తి
పిల్లలకు కొత్త విషయాలను నేర్చుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. కనుక ఆహారం, టెక్నాలజీ, క్రీడలు, స్నేహాల విషయంలో ఆంక్షలు పెట్టకుండా వారిని అనుమతించడం వల్ల కొత్తవి నేర్చుకుంటారు. దీనివల్ల వారిలో స్వతంత్రత పెరుగుతుంది. పిల్లల కోసం కొత్త యాక్టివిటీలను గుర్తించడం మంచి ఫలితాలను ఇస్తుంది. 

సామాజికాభివృద్ధి
మనుషులు అంటేనే సంఘ జీవులు. కనుక సమాజంతో పిల్లలను మమేకం చేయడం కూడా వారి వ్యక్తిత్వ వికాస అభివృద్ధికి తోడ్పడుతుంది. వ్యక్తులతో సానుకూల సంబంధాలు, ఇతరులతో కలిసిపోవడం ఇవన్నీ వారికి తెలియాలి. దీనివల్ల వారికి వివిధ సందర్భాలను ఎలా ఎదుర్కోవాలన్నది అనుభవం అవుతుంది. వారిలో విశ్వాసాన్ని నింపుతుంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు, టీచర్లు, తోటి విద్యార్థులతో ఎప్పటిప్పుడు సంభాషించడం వల్ల వారిలో సామాజిక నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి.

సాధన
చివరిగా అధ్యయనం, సాధన అన్నవి పిల్లలకు నేర్పాల్సిన వాటిలో ముఖ్యమైనవి. పిల్లల వ్యక్తిత్వ వికాసంలో నేర్చుకోవడం కీలక పాత్ర పోషిస్తుంది. విద్యా సంబంధ పాఠాలను వినడం, చూడడానికి పరిమితం కాకుండా.. సమస్యలను పరిష్కరించే కార్యకలాపాల్లో వారిని భాగస్వాములను చేయాలి. కొత్త నైపుణ్యాలు,, అంశాలు నేర్చుకోవడాన్ని ప్రోత్సహించి, వారిని పరీక్షిస్తూ ఉండాలి.

More Telugu News