Varla Ramaiah: కొడాలి నాని నిర్వహించిన కేసినోలో వల్లభనేని వంశీ భాగస్వామిగా ఉన్నారు: వర్ల రామయ్య

Vallabhaneni Vamsi is partner in Kodali Nani casino says Varla Ramaiah
  • కొడాలి నాని, వల్లభనేని వంశీల బండారం బయటపడిందన్న రామయ్య 
  • నేపాల్ కు వెళ్లిన వారి జాబితా బయటపెడితే వైసీపీ ప్రభుత్వం కూలిపోతుందని వ్యాఖ్య 
  • గుడివాడ కేసినోలో ఎంట్రీ టికెట్ల ద్వారానే రూ. 180 కోట్లు చేతులు మారాయని ఆరోపణ 
కేసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించింది. మరోవైపు ఈ అంశంపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య మాట్లాడుతూ, నేపాల్ లో కేసినోను నడిపిన ప్రవీణ్ భాగోతంతో కొడాలి నాని, వల్లభనేని వంశీల బండారం బట్టబయలైందని అన్నారు. త్వరలోనే అందరి భాగోతాలను ఈడీ బయటపెడుతుందని చెప్పారు. జూన్ 10 నుంచి 13 తేదీల్లో నేపాల్ కు ప్రత్యేక విమానంలో వెళ్లిన వారి జాబితాను బయటపెడితే వైసీపీ ప్రభుత్వం కూలిపోతుందని అన్నారు. కేసినో వ్యవహారాలతో వైసీపీ పెద్దలు బ్లాక్ మనీని వైట్ చేసుకుంటున్నారని ఆరోపించారు.  

విశాఖపట్నం, నెల్లూరు, గుంటూరు, విజయవాడ, భీమవరం, ఏలూరు నుంచి జూదగాళ్లు వెళ్లడానికి హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ప్రవీణ్ ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశాడని చెప్పారు. విమాన ఛార్జీలు, భోజనాలు, బస, అశ్లీల నృత్యాలకు ఒక్కొక్కరి నుంచి రూ. 3 లక్షలు వసూలు చేశాడని అన్నారు. నేపాల్ కు వెళ్లిన వారిలో సగం మంది వైసీపీవాళ్లేనని చెప్పారు. 

గుడివాడలో కొడాలి నాని నిర్వహించిన కేసినోలో వల్లభనేని వంశీ కూడా భాగస్వామిగా ఉన్నారని వర్ల రామయ్య ఆరోపించారు. సంక్రాంతి సమయంలో నిర్వహించిన ఈ కేసినో ద్వారా పేదల్ని దోపిడీ చేశారని మండిపడ్డారు. ఈ కేసినోకు కేరళ నుంచి వందలాది మంది వచ్చారని... ఇక్కడ వన్ సైడ్ గా జరిగిన గేమ్స్ లో అందరూ డబ్బులు పోగొట్టుకున్నారని చెప్పారు. దీనిపై కేరళ జూదగాళ్లు ఈడీకి ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ విషయాన్ని తెలుసుకున్న కేరళ ప్రభుత్వం నివ్వెరపోయిందని... కానీ, మన ముఖ్యమంత్రి జగన్ కు మాత్రం ఏమీ తెలియదని ఎద్దేవా చేశారు. 

గుడివాడ కేసినోలో ఎంట్రీ టికెట్ల ద్వారానే రూ. 180 కోట్లు చేతులు మారాయని చెప్పారు. ఈ డబ్బును నేపాల్ వెళ్లిన తర్వాత ప్రవీణ్ టీమ్ అక్కడి కరెన్సీగా మార్చి మనీ లాండరింగ్ చేసిందని తెలిపారు. ఆ తర్వాత లావోస్ లోని బ్యాంక్ ఖాతాల్లో వేశారని చెప్పారు. అనంతరం లావోస్ నుంచి ఏపీకి ఈ డబ్బు పెద్ద మొత్తంలో రావడంతో ఆర్బీఐ ఉలిక్కిపడిందని అన్నారు. వల్లభనేని వంశీతో ప్రవీణ్ కు ఉన్న సాన్నిహిత్యం గురించి గతంలో టీడీపీ చెప్పిందని తెలిపారు. త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పారు. కేసినో సెగ మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్, ఎస్పీ సత్యానందం, విచారణాధికారి శ్రీనివాస్, కొందరు పోలీసులకు కూడా తగులుతుందని అన్నారు.
Varla Ramaiah
Telugudesam
Kodali Nani
vall
Jagan
YSRCP
Casino
Nepal

More Telugu News