JR Pushparaj: మాజీ మంత్రి జేఆర్ పుష్పరాజ్ కన్నుమూత... దిగ్భ్రాంతి కలిగించిందన్న చంద్రబాబు

  • తీవ్ర అనారోగ్యంతో మృతిచెందిన పుష్పరాజ్
  • గతేడాది కరోనా బారినపడిన మాజీ మంత్రి
  • ఆరోగ్యాన్ని దెబ్బతీసిన ఇతర అనారోగ్య సమస్యలు
  • కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపిన చంద్రబాబు
Chandrababu condolences to the demise of TDP senior leader and former minister JR Pushparaj

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ నేత జేఆర్ పుష్పరాజ్ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు స్పందిస్తూ.. పార్టీ సీనియర్ నేత, ఆత్మీయులు జేఆర్ పుష్పరాజ్ మరణం తనకు దిగ్భ్రాంతి కలిగించిందని అన్నారు. సాంఘిక సంక్షేమ మంత్రిగా, ఏపీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గా, దళిత, నిరుపేద ప్రజలకు పుష్పరాజ్ చేసిన సేవలు చిరస్మరణీయం అని పేర్కొన్నారు. 

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించిన పుష్పరాజ్ ప్రతి సందర్భంలోనూ పార్టీకి నిజాయతీగా సేవలందించారని చంద్రబాబు కీర్తించారు. ఆయన మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటు అని పేర్కొన్నారు. పుష్పరాజ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు. 

జేఆర్ పుష్పరాజ్ గత సంవత్సరం కరోనాబారిన పడ్డారు. దాని నుంచి కోలుకున్నా, ఇతర అనారోగ్య సమస్యలు ఆయన ఆరోగ్యాన్ని దెబ్బతీశాయి. గుంటూరులో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి మూడు పర్యాయాలు ప్రాతినిధ్యం వహించారు.

More Telugu News