Prabath Jayasuriya: ప్రభాత్ జయసూర్య... టెస్టు క్రికెట్లో సరికొత్త స్పిన్ సంచలనం

Prabath Jayasuriya the new spin sensation in Sri Lanka cricket
  • 3 టెస్టులాడి 29 వికెట్లు తీసిన ప్రభాత్
  • 30 ఏళ్ల వయసులో టెస్టు క్రికెట్ అరంగేట్రం
  • తొలి టెస్టులోనే 12 వికెట్లు తీసిన వైనం
  • తాజాగా పాకిస్థాన్ పై విజయంలో కీలకపాత్ర

శ్రీలంక క్రికెట్లో ఇటీవల తరచుగా వినిపిస్తున్న పేరు ప్రభాత్ జయసూర్య. తన సంచలన స్పిన్ బౌలింగ్ తో శ్రీలంక జట్టుకు రెండు పర్యాయాలు విజయాలను అందించాడు. ఇంతజేసీ కెరీర్ లో ఆడింది 3 టెస్టులే. ఈ 3 టెస్టుల్లో కలిపి ప్రభాత్ జయసూర్య పడిగొట్టిన వికెట్ల సంఖ్య... 29. ఈ గణాంకాలు చాలు అతడెంత ప్రతిభావంతుడో చెప్పడానికి!

తాజాగా, పాకిస్థాన్ తో ముగిసిన రెండో టెస్టులో శ్రీలంక 246 పరుగులతో భారీ విజయం సాధించగా, అందులో కీలకపాత్ర పోషించింది ఈ లెఫ్టార్మ్ స్పిన్నరే. గాలేలో జరిగిన ఈ టెస్టులో ప్రభాత్ తొలి ఇన్నింగ్స్ లో 3 వికెట్లు తీయగా, రెండో ఇన్నింగ్స్ లో మరింత చెలరేగి 5 వికెట్లు పడగొట్టాడు. తద్వారా పాక్ పతనంలో ప్రధానభూమిక వహించాడు. 

30 ఏళ్ల ప్రభాత్ జయసూర్య టెస్ట్ క్రికెట్లోకి చాలా ఆలస్యంగా అడుగుపెట్టాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో టెస్టు ద్వారా అరంగేట్రం చేసిన ప్రభాత్ జయసూర్య ఆ మ్యాచ్ లో కంగారూలను తన స్పిన్ తో ముప్పుతిప్పలు పెట్టాడు. రెండు ఇన్నింగ్స్ లలోనూ ఆరేసి వికెట్లు తీసి ఆ మ్యాచ్ లో మొత్తం 12 వికెట్లను పడగొట్టి క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. 

ఆ తర్వాత పాకిస్థాన్ తో మొదటి టెస్టులోనూ ప్రభాత్ వికెట్ల వేట కొనసాగింది. తొలి ఇన్నింగ్స్ లో 5, రెండో ఇన్నింగ్స్ లో 4 వికెట్లు తీసి సత్తా చాటాడు. ఏమైనా, ముత్తయ్య మురళీధరన్ తర్వాత శ్రీలంక జట్టుకు అంతటి నాణ్యమైన స్పిన్నర్ లేని లోటును ప్రభాత్ జయసూర్య తీర్చే అవకాశాలున్నాయి. అయితే అతడి వయసు దృష్ట్యా అంతర్జాతీయ క్రికెట్లో ఎంతకాలం కొనసాగుతాడన్నది చెప్పడం కష్టమే.

  • Loading...

More Telugu News