Andhra Pradesh: ప్రభుత్వ ఉపాధ్యాయులపై కక్ష సాధించేందుకే జగన్ సర్కారు 117 జీవో తెచ్చింది: నారా లోకేశ్

Nara lokesh demands AP Govt to withdraw GO no 117
  • స‌ర్కారు జారీచేసిన జీవోలు 117, 128, 84, 85ల‌తో విద్యా వ్యవ‌స్థ అస్తవ్యస్తంగా మారిందని విమర్శ
  • ప్రైవేట్ స్కూళ్లకు లబ్ధి చేసేలా ఉన్న ఆ జీవోలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్
  • దీనిపై ఉద్యమిస్తున్న ఉపాధ్యాయ సంఘాలకు టీడీపీ మద్దతు ఇస్తుందన్న లోకేశ్
ఆంధ్రప్రదేశ్ లో విద్యాసంస్కర‌ణ‌ల పేరుతో వైసీపీ స‌ర్కారు అమ‌లు చేస్తోన్న 117 జీవో  ప్రభుత్వ ఉపాధ్యాయులపై క‌క్ష సాధించేలా ఉందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. జాతీయ విద్యా విధానం అమలు పేరుతో ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ, పాఠశాలల విలీనం కోసం స‌ర్కారు జారీ చేసిన 117, 128, 84, 85 జీవోల‌తో విద్యా వ్యవ‌స్థ అస్తవ్యస్తంగా మారిందన్నారు. 

పాఠ‌శాల‌ల విలీనంతో నిరుపేద విద్యార్థులు విద్యకి పూర్తిగా దూర‌మై బాల‌కార్మికులుగా మారే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎస్ ర‌ద్దు, త‌మ‌కు రావాల్సిన ప్రయోజ‌నాల కోసం పోరాడిన ఉపాధ్యాయుల‌పై క‌క్ష సాధించేందుకు ఈ నూత‌న విద్యావిధానాన్ని జ‌గ‌న్‌ మోహన్ రెడ్డి  ప్రభుత్వం ఒక ఆయుధంగా వాడుతోందని విమర్శలు చేశారు.     

వారానికి 24 నుండి 30 పీరియడ్లు మాత్రమే చెప్పగ‌లిగిన ఉపాధ్యాయులు.. వైసీపీ స‌ర్కారు తెచ్చిన తాజా జీవో ప్రకారం వారానికి 40 నుండి 48 పీరియడ్లు ప‌నిచేయాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. కొత్తగా అమ‌లు చేస్తోన్న విద్యావిధానంలో అనేక‌ హైస్కూళ్లలో హెడ్‌మాస్టర్‌, పీఈటీ, స‌బ్జెక్ట్ టీచ‌ర్లు ఉండబోరని లోకేశ్ అన్నారు. ప్రభుత్వ విద్యావ్యవస్థని అస్తవ్యస్తం చేసి, ప్రైవేట్ స్కూళ్లకు ల‌బ్ధి చేకూర్చేలా వున్న 117, 128, 84, 85జీవోలు వెన‌క్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యమిస్తున్న ఉపాధ్యాయ సంఘాల‌కు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మ‌ద్దతు ఇస్తుందని లోకేశ్ స్పష్టం చేశారు.
Andhra Pradesh
YSRCP
YS Jagan
GO NO 117
SCHOOLS
Nara Lokesh
TDP

More Telugu News