Health: పొట్ట తగ్గించుకునేందుకు తొమ్మిది చక్కని మార్గాలివిగో!

  • ఆహారం, వ్యాయామానికి తోడు తగిన జాగ్రత్తలూ అవసరమంటున్న నిపుణులు
  • కేవలం అబ్డామినల్ వ్యాయామాలే కాకుండా ఇతర ఎక్సర్ సైజులూ చేయాలని సూచన
  • తగిన నిద్ర ఉండాలని.. ఒత్తిడిని తగ్గించుకోవాలని వివరణ
  • కొన్ని రోజుల్లోనే బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవచ్చంటూ వచ్చే ప్రకటనలకు దూరంగా ఉండాలని సూచన
Nine effective ways to lose belly fat

మారుతున్న జీవన శైలి, ఆహారం కారణంగా చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. శరీరంలో కొవ్వు పేరుకుపోతోంది. అది కూడా మెల్లగా పొట్టలో, నడుము చుట్టూ పేరుకుపోతోంది. శరీరం ఆకృతి దెబ్బతింటోంది. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడంతో మరెన్నో ఆరోగ్య సమస్యలూ తలెత్తుతున్నాయి. చాలా మంది ఈ బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకునేందుకు నానా తంటాలూ పడుతుంటారు. బెల్లీ ఫ్యాట్ అనేది శరీరంలో ఇతర చోట్ల ఉండే కొవ్వు కంటే భిన్నమైదని.. అందుకే దాన్ని తగ్గించుకోవడం కొంత కష్టమైన పనేనని వైద్యులు, పోషకాహార నిపుణులు అంటున్నారు.

అధిక బెల్లీ ఫ్యాట్ అనేది గుండె జబ్బులకు కారణమవుతుందని పోషకాహార నిపుణుడు మరిక్రిస్ లపేక్స్ చెబుతున్నారు. కేవలం వారంలోనో, నెల రోజుల్లోనో బెల్లీ ఫ్యాట్ తగ్గిపోతుందంటూ వచ్చే ప్రకటనలు అవాస్తవం, అత్యంత ప్రమాదకరమని స్పష్టం చేస్తున్నారు. పొట్టకు సంబంధించిన వ్యాయామాలు చేయడంతోపాటు తగిన ఆహారం తీసుకోవడం ద్వారా బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవచ్చని.. అయితే ఇందుకు కొంత సమయం పడుతుందని గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు. మీ శరీరానికి తగిన డైట్, వ్యాయామం కోసం వైద్య నిపుణుల సలహాలు తీసుకోవాలని చెబుతున్నారు. సాధారణంగా బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకునేందుకు 9 మార్గాలు ఉన్నాయని వివరిస్తున్నారు. 

1. చక్కెర, రిఫైన్డ్ ఆహారానికి దూరంగా ఉండటం
కూల్ డ్రింకులు, స్పోర్ట్స్ డ్రింకులు, సోడాలు, కాఫీ ఆధారిత పానీయాలు వంటివాటిలో అధిక స్థాయిలో చక్కెర ఉంటుందని, వాటి వినియోగం వీలైనంతగా తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆల్కాహాల్ ను, అందులో ముఖ్యంగా బీర్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు పెరగడానికి, బెల్లీ ఫ్యాట్ రావడానికి కారణమవుతుందని చెబుతున్నారు. వ్యాయామాలు చేసినప్పుడు కూడా అత్యవసరమైన ఎలక్ట్రోలైట్స్ అందేలా ప్రత్యేక డ్రింక్ ప్యాకెట్లు వాడాలని.. స్పోర్ట్స్ డ్రింక్స్ కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

2. తగిన స్థాయిలో నీటిని తాగాలి
నిత్యం తగినంత నీరు తాగడం వల్ల శరీరంలో జీవ క్రియలు సాఫీగా సాగుతాయి. అంతేగాకుండా దీనితో ఆహారం తక్కువగా తీసుకుంటారు. ఇది బరువు తగ్గడానికి, శరీరంలో కొవ్వు తగ్గడానికి తోడ్పడుతుంది. నేరుగా నీళ్లలా కాకుండా, చక్కెర ఎక్కువగా ఉండే డ్రింక్స్ కు బదులుగా.. నిమ్మ రసం కలుపుకొని నీళ్లు తాగడం వల్ల మరింత ఎక్కువ లాభం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

3. ప్రొటీన్, ఫైబర్ ఎక్కువుండే ఆహార పదార్థాలు 
శరీరానికి తగిన స్థాయిలో ఫైబర్, ప్రొటీన్లు అందేలా పూర్తి స్థాయి ఆహార ధాన్యాలను తీసుకోవడం వల్ల బరువు తగ్గడానికి వీలవుతుందని నిపుణులు చెబుతున్నారు. బాదం, ఓట్స్, బెర్రీస్, బ్రాకొలి, మొలకెత్తిన విత్తనాలు, చిక్కుడు జాతి గింజలు వంటివి తీసుకోవడం వల్ల శరీరానికి ఓ వైపు ప్రొటీన్లు, మరోవైపు ఫైబర్ రెండూ అందుతాయని వివరిస్తున్నారు. కావాలంటే చికెన్, టర్కీ కోడి మాంసం, గుడ్లు, చేపలు, పాల పదార్థాలు తీసుకోవచ్చని.. అయితే వీటిలో కొవ్వు లేకుండా చూసుకోవాలని స్పష్టం చేస్తున్నారు.

  • ఎట్టి పరిస్థితుల్లోనూ రిఫైన్డ్ ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని.. వాటిలో కార్బోహైడ్రేట్లు మాత్రమే ఎక్కువగా ఉండి శరీరంలో కొవ్వు పేరుకుపోవడానికి కారణం అవుతాయని వివరిస్తున్నారు.

4. వివిధ రకాల వ్యాయామాలు కలిపి చేయాలి
కేవలం అబ్డామినల్ వ్యాయామాలు మాత్రమే చేయడం వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గిపోదని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో కండరాలు గట్టిపడే వ్యాయామాలతోపాటు అబ్డామినల్ వ్యాయామాలు కూడా కలిపి చేయాలని సూచిస్తున్నారు. బరువులు ఎత్తడం, రెసిస్టెన్స్ బ్యాండ్స్ వంటివాటిని గట్టిగా లాగడం, రన్నింగ్, రోప్ జంపింగ్ వంటి వ్యాయామాలు చేస్తూనే.. అబ్డామినల్ ఎక్సర్ సైజ్ లు కూడా చేయాలని స్పష్టం చేస్తున్నారు. అప్పుడే శరీరంలో మొత్తం కొవ్వు తగ్గుతూ.. బెల్లీ ఫ్యాట్ కూడా కరుగుతుందని వివరిస్తున్నారు.

5. ఏమేం తింటున్నామో కచ్చితంగా సరి చూసుకోవాలి 
ఆహారం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటున్నాం, ఏమేం తింటున్నాం, వాటి వల్ల ఫలితం ఎంత వరకు ఉంటోందన్నది సరి చూసుకునేందుకు ‘ఫుడ్ డైరీ’ని రాసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవసరమైతే దీనికోసం ప్రత్యేకమైన యాప్ లు కూడా అందుబాటులో ఉన్నాయని, వాటిని వినియోగించుకోవచ్చని అంటున్నారు. రోజూ పొద్దంతా తినే, తాగే ప్రతి దానినీ రాసిపెట్టుకుని.. సరి చూసుకోవడం ద్వారా కచ్చితమైన డైట్ అనుసరించడానికి వీలవుతుందని సూచిస్తున్నారు.

6. కొన్ని రకాల ఆహార నియమాలను అనుసరించండి
ప్రతి ఒక్కరి శరీరం ఇతరులతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. అందువల్ల బెల్లీ ఫ్యాట్ ను తగ్గించేందుకు ఆహారం, వ్యాయామాలతోపాటు వివిధ పద్ధతులనూ అనుసరించాల్సి ఉంటుంది. ఇటీవల ఫాస్టింగ్, ఇంటెర్మిటెంట్ ఫాస్టింగ్, కీటో డైట్ వంటి విధానాలు ఎక్కువగా ఆదరణ పొందుతున్నాయి. వీటిలో మీ శరీరానికి ఏది సరిపడుతుందో వైద్యులను సంప్రదించి అనుసరించడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిఫుణులు సూచిస్తున్నారు.

7. ఆహారంలో ప్రోబయాటిక్స్, ప్రీ బయాటిక్స్ వాడటం
ప్రోబయాటిక్స్ తగిన స్థాయిలో తీసుకోవడం వల్ల శరీరంలో ఆకలి, ఇతర జీవ క్రియలు సరైనస్థాయిలో జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. దాంతోపాటు శరీరంలో అనవసర కొవ్వు కూడా నియంత్రణలో ఉంటుందని వివరిస్తున్నారు. మార్కెట్లో ఎన్నో ప్రోబయాటిక్స్ లభిస్తాయని, వైద్యుల సూచన మేరకు వాటిని వాడాలని అంటున్నారు. అదే సమయంలో యాపిల్స్, పెరుగు వంటి ప్రీ బయాటిక్ ఆహారం కూడా తీసుకోవాలని చెబుతున్నారు.

8. తగిన స్థాయిలో నిద్ర ఉండాలి
తగిన స్థాయిలో నిద్ర లేకపోవడం వల్ల శరీరానికి విశ్రాంతి లేక ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని.. అధిక ఆకలి, మధుమేహం, హార్మోన్ల అసమతుల్యత వంటివి తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇవన్నీ ఊబకాయానికి, బెల్లీ ఫ్యాట్ కు దారి తీస్తాయని.. అందువల్ల తగిన స్థాయిలో నిద్ర ఉండేలా చూసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. నిద్రపోయే ముందు కాఫీ తాగడం, ఎక్కువ సేపు టీవీ, ఫోన్ వంటివి తగ్గిస్తే.. సరైన నిద్ర పడుతుందని పేర్కొంటున్నారు.

9. మానసిక ఒత్తిళ్లకు దూరంగా ఉండాలి
మానసిక ఒత్తిళ్ల కారణంగా విడుదలయ్యే హార్మోన్లు శరీరంలో కొవ్వును పెంచుతాయని పలు పరిశోధనల్లో తేలిందని నిపుణులు వివరిస్తున్నారు. అంతేగాకుండా ఇన్సులిన్ పనితీరు దెబ్బతింటుందని, ఆకలిగా అనిపించడం పెరుగుతుందని.. ఇవన్నీ శరీరంలో కొవ్వును పెంచుతాయని స్పష్టం చేస్తున్నారు. అందువల్ల మానసిక ఒత్తిడి తగ్గించుకునేందుకు యోగా, ధ్యానం వంటివి చేయడం, తగిన మందులు వాడటం మంచిదని సూచిస్తున్నారు.

More Telugu News