అన్న కోసం వస్తున్న ఎన్టీఆర్

26-07-2022 Tue 12:20 | Entertainment
  • ఈనెల 29న  కల్యాణ్ రామ్ ‘బింబిసార’ ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఎన్టీఆర్
  • విషయం చెబుతూ ప్రత్యేక టీజర్ విడుదల చేసిన చిత్ర బృందం
NTR to grace  Bimbisara Pre Release Event  as chief guest
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా చిత్రం 'బింబిసార'. తన సొంత బ్యానర్లో కల్యాణ్ రామ్ ఈ సినిమాను నిర్మించాడు. మల్లిడి వశిష్ఠ దర్శకత్వం వహించాడు. ఆగస్టు 5వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 29వ తేదీన నిర్వహించనున్నారు. 

హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగే ఈ వేడుకకు ముఖ్య అతిథిగా కల్యాణ్ రామ్ తమ్ముడు ఎన్టీఆర్ వస్తున్నాడు. ఈ విషయాన్ని చిత్ర బృందం మంగళవారం ప్రకటించింది. ఈ ఈవెంట్ కోసం ఓ టీజర్ ను కూడా విడుదల చేసింది. ‘బింబిసార’ చిత్రంలో కల్యాణ్ రామ్ యాక్షన్ సీన్స్, ‘జై లవకుశ’ చిత్రంలో ఎన్టీఆర్ రావణ క్యారెక్టర్ కు సంబంధించిన కొన్ని సీన్లను కలిపి రూపొందించిన టీజర్ ఆసక్తికరంగా ఉంది. వస్తున్నా అంటూ బ్యాక్ గ్రౌండ్ లో ఎన్టీఆర్ వాయిస్ వినిపించారు. 

కాగా, ‘బింబిసార’ చిత్రంలో కల్యాణ్ రామ్ రెండు రకాల పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఈ కథ బింబిసారుడి కాలంతోపాటు వర్తమానంలోనూ నడుస్తుందని ట్రైలర్లో చూపెట్టారు. చరిత్రలో రాజుగాను, ప్రస్తుత కాలంలో మోడ్రన్ లుక్ లోను కల్యాణ్ రామ్ కనిపించనున్నాడు. కేథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్ కీలకమైన పాత్రను పోషించారు.