Telangana: నిన్ను నమ్మేది లేదు.. నమ్మి మరోసారి మోసపోయేది లేదు: షర్మిల విమర్శలు

YSRTP Chief YS Sharmila slams CM KCR over delay in job notifications
  • ఎన్నికలు వచ్చినప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లు అంటూ దొంగ హామీలు ఇస్తారన్న షర్మిల 
  • 80 వేల ఉద్యోగాలే ఖాళీగా ఉన్నట్టు తప్పులు లెక్కలు చూపెట్టారని విమర్శ 
  • ఇంకా నోటిఫికేషన్లు వెలువడకపోవడంపై ఆగ్రహం
  • ఉద్యోగాలు భర్తీ చేసే వరకూ తమ పోరాటం ఆగదన్న షర్మిల 
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి విమర్శలు చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లు, నియామక ప్రక్రియపై రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. కేసీఆర్ పేరు ప్రస్తావించకుండా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా త్వరలో నోటిఫికేషన్లు అని హామీలు ఇస్తారని విమర్శించారు. 

80 వేల ఉద్యోగాలే ఖాళీగా ఉన్నాయని తప్పుల లెక్కలు చెప్పారని, తక్షణమే నియామక ప్రక్రియ మొదలవుతుందని అసెంబ్లీలో అబద్ధం ఆడారని దుయ్యబట్టారు. ‘ఎన్నికలు ఎప్పుడు వచ్చినా త్వరలో నోటిఫికేషన్లు అని దొంగ హామీలు ఇచ్చావు. లక్షా 91 వేల ఖాళీలు కాదని, కొత్త లెక్కలు తేల్చాలని కమిటీలతో కాలయాపన చేశావు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు 80 వేల ఖాళీలేనని లెక్క తేల్చావు. రేపటి నుంచే భర్తీ ప్రక్రియ స్టార్ట్ అని అసెంబ్లీ సాక్షిగా అబద్దం ఆడావు’ అని షర్మిల ట్వీట్ చేశారు. 

నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేసే వరకూ తమ పార్టీ పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. ‘అసెంబ్లీలో చెప్పి ఆరు  నెలలు గడుస్తున్నా ఆర్థిక శాఖ అనుమతులు వచ్చాయని హడావుడి తప్పితే ఇప్పటివరకు ఖాళీలన్నింటికీ నోటిఫికేషన్లు ఇచ్చింది లేదు. అందుకే నిన్ను నమ్మేది లేదు. నమ్మి మరోసారి మోసపోయేది లేదు. నోటిఫికేషన్లు ఇచ్చేవరకు, ఖాళీలు భర్తీ చేసే వరకు నిరుద్యోగుల పక్షాన మా పోరాటం సాగుతూనే ఉంటుంది’ అని షర్మిల పేర్కొన్నారు.
Telangana
cm
KCR
YSRTP
YS Sharmila
jobs
notifications

More Telugu News