Mallikarjun Kharge: ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో మల్లికార్జున్ ఖర్గే సీటుపై వివాదం

  • పార్లమెంటు సెంట్రల్ హాలులో ముుర్ము ప్రమాణ స్వీకారం
  • మల్లికార్జున్ ఖర్గేకు కార్నర్ సీటు కేటాయింపు
  • ప్రొటోకాల్ పాటించలేదంటూ రాజ్యసభ చైర్మన్‌కు ప్రతిపక్షాల లేఖ
  • ప్రతిపక్షాలది అనవసర రాద్ధాంతమన్న కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి
Mallikarjun Kharge on row linked to President oath

నూతన రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం వేళ కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే సీటుపై వివాదం రేకెత్తింది. పార్లమెంటు సెంట్రల్ హాలులో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతోపాటు అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ముఖ్య నేతలు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా మల్లికార్జున్ ఖర్గేకు కేబినెట్ మంత్రుల పక్కన మొదటి వరుసలో మూలన సీటు కేటాయించారు. ఇది తీవ్ర విమర్శలకు దారితీసింది. రాజ్యసభలో ప్రతిపక్ష నేత అయిన ఖర్గేకు ఓ మూలన సీటు కేటాయించడాన్ని నిరసిస్తూ ప్రతిపక్షాలు రాజ్యసభ చైర్మన్‌కు లేఖ రాశాయి. సీటు కేటాయించే విషయంలో ప్రొటోకాల్ పాటించకుండా సీనియర్ నేతను అవమానించారని అందులో ఆగ్రహం వ్యక్తం చేశాయి.

ఖర్గేకు సీటు కేటాయింపు విషయంలో వస్తున్న ఆరోపణలను కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి కొట్టిపడేశారు. నిజానికి కేబినెట్ మంత్రుల తర్వాత ఆయనకు మూడో వరుసలో సీటు కేటాయించాలని, కానీ ఆయన సీనియారిటీకి గౌరవమిచ్చి తొలి వరుసలోనే కూర్చోబెట్టామని అన్నారు. తన సీటుపై ఖర్గే అభ్యంతరం వ్యక్తం చేశాక మధ్యలో కూర్చోమని సిబ్బంది చెప్పినా ఆయన అందుకు అంగీకరించలేదన్నారు. ప్రతిపక్షాలది అనవసర రాద్ధాంతమని ప్రహ్లాద్ జోషి ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News