Chhattisgarh: హారన్ కొడుతున్నా పక్కకు జరగలేదని.. పొడిచి చంపేసిన బాలిక!

Girl stabs differently abled man to death in Chhattisgarh
  • ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్‌లో ఘటన
  • సైకిలుపై ముందు వెళ్తున్న వ్యక్తి సైడ్ ఇవ్వలేదని ఆగ్రహం
  • కత్తితో గొంతులో పొడిచిన బాలిక
  • తీవ్ర గాయాలతో బాధితుడి మృతి
హారన్ కొడుతున్నా పక్కకు తప్పుకోలేదన్న ఆగ్రహంతో ఓ బాలిక 40 ఏళ్ల వ్యక్తిని నడిరోడ్డుపై కత్తితో పొడిచి చంపింది. ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. కంకిలిపారా ప్రాంతంలో 15 ఏళ్ల బాలిక స్కూటీపై తన తల్లిని తీసుకుని వస్తోంది. 

ఈ క్రమంలో ఆమె ముందు సుదామా లాడెర్ (40) అనే వ్యక్తి సైకిలుపై వెళ్తున్నాడు. వెనక వస్తున్న బాలిక సైకిల్‌ను దాటి ముందుకెళ్లాలన్న ఉద్దేశంతో పలుమార్లు హారన్ కొట్టింది. అయితే, బధిరుడైన సుదామాకు హారన్ శబ్దం వినిపించకపోవడంతో ఆమెకు సైడ్ ఇవ్వలేదు.

హారన్ కొడుతున్నా సుదామా తప్పుకోకపోవడంతో కావాలనే అతడు తనకు దారివ్వడం లేదని ఆమె భావించింది. దీంతో సైకిల్‌ను దాటి ముందుకెళ్లి స్కూటీ ఆపిన బాలిక తన వద్ద ఉన్న కత్తితో సుదామా గొంతులో పొడిచింది. వెంటనే అతడు కుప్పకూలిపోయాడు. దీంతో భయపడిన బాలిక తల్లిని అక్కడే వదిలేసి పరారైంది. 

బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Chhattisgarh
Girl
Cyclist
Raipur

More Telugu News