Breast Cancer: ఈ ఆహార పదార్థాలతో రొమ్ము క్యాన్సర్ ముప్పు ఎక్కువట!

  • అత్యధికులు రొమ్ము క్యాన్సర్ బాధితులే అంటున్న డబ్ల్యూహెచ్ఓ 
  • వృక్ష సంబంధ అనారోగ్యకర ఆహారాలతో ముప్పు
  • ఫ్రెంచ్ వైద్యుల అధ్యయనంలో వెల్లడి 
These foods causes high risk of breast cancer

గతేడాది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఓ ఆసక్తికర నివేదిక వెలువరించింది. దాని సారాంశం ఏమిటంటే... ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ రోగుల్లో ఎక్కువమంది రొమ్ము క్యాన్సర్ బాధితులేనట. గతంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు అత్యధికంగా నమోదయ్యేవని, ఇప్పుడా స్థానాన్ని రొమ్ము క్యాన్సర్ ఆక్రమించిందని అంతర్జాతీయ క్యాన్సర్ రీసెర్చ్ ఏజెన్సీ (ఐఏఆర్సీ)ని ఉటంకిస్తూ డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. 

ఇక, బ్రెస్ట్ క్యాన్సర్ ఇండియా సంస్థ చెబుతున్న విషయాలైతే దిగ్భ్రాంతి కలిగిస్తాయి. ప్రతి 4 నిమిషాలకు ఓ భారత మహిళకు బ్రెస్ట్ క్యాన్సర్ నిర్ధారణ అవుతోందని, ప్రతి 8 నిమిషాలకు ఒకరు ఈ రొమ్ము క్యాన్సర్ తో మరణిస్తున్నారని బ్రెస్ట్ క్యాన్సర్ ఇండియా పేర్కొంది. అయితే, కుటుంబ జన్యు చరిత్ర, వయసు, ఊబకాయం వంటి అంశాలే కాకుండా, ఆహారపు అలవాట్లు కూడా రొమ్ము క్యాన్సర్ ముప్పు పెరిగేందుకు కారణమవుతాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. 

కొన్ని నిర్దిష్ట ఆహార పదార్థాలతో ఈ రొమ్ము క్యాన్సర్ ముప్పు దాదాపు 20 శాతం పెరుగుతుందట. తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, నట్స్, చిక్కుళ్లు వంటి ఆరోగ్యకరమైన ఆహారం తినేవారి కంటే బియ్యం తదితర రిఫైన్డ్ ధాన్యాలు (ప్రాసెస్ చేసిన ధాన్యాలు), పిండితో చేసిన పదార్థాలు, బ్రెడ్ వంటి వృక్ష సంబంధ ఆహార పదార్థాలు తీసుకునేవారిలో రొమ్ము క్యాన్సర్ ముప్పు మరింత అధికమని ఫ్రెంచ్ వైద్యులు వివరించారు. ఈ వృక్ష సంబంధ అనారోగ్యకర ఆహార పదార్థాలు మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ తీవ్రతకు దారితీస్తాయని పేర్కొన్నారు. 

న్యూట్రిషన్ 2022 సదస్సులో ఈ మేరకు అధ్యయన వివరాలు సమర్పించారు. ఈ అధ్యయనం కోసం మెనోపాజ్ దశ దాటిన 65 వేల మంది మహిళలను 20 ఏళ్ల పాటు పరిశీలించారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నవారిలో బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు 14 శాతం తక్కువగా ఉంటే, అనారోగ్యకర ఆహారం తీసుకునేవారిలో ఆ ముప్పు 20 శాతం అధికంగా ఉందని తెలిపారు.

More Telugu News