GAU: ఆవులకూ ఫేస్ రికగ్నిషన్.. యాప్ ను రూపొందించిన అహ్మదాబాద్ ఐఐఎం

  • గ్రామీణ భారతం ఇప్పటికీ ఆవులపై ఆధారపడి ఉందన్న నిపుణులు
  • గోశాలల నిర్వహణ, ఆవుల దత్తత, దాతల విరాళాలకు అనుకూలంగా ఉంటుందని వెల్లడి
  • 92 శాతం కచ్చితత్వంతో ఆవులను గుర్తించవచ్చని వివరణ
GAU vision app IIM Ahmedabad paper proposes new facial recognition tool for Cows

ఫోన్ లో ఫేస్ రికగ్నిషన్ సౌకర్యాన్ని తరచూ వాడుతుంటాం. మొబైల్ ను అన్ లాక్ చేయడానికి వినియోగిస్తుంటాం. ఇక ఆఫీసులోనో, మరో చోటనో ఫేస్ రికగ్నిషన్ తో హాజరు వేయడం కూడా తెలిసిందే. తాజాగా ఆవుల కోసం కూడా ఫేస్ రికగ్నిషన్ యాప్ ను అహ్మదాబాద్ ఐఐఎం (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్) నిపుణులు రూపొందించారు. ‘గౌ (జీఏయూ) విజన్ యాప్’ పేరిట దీనిని తయారుచేశారు. దీనికి సంబంధించి ఐఐఎం ఫ్యాకల్టీ మెంబర్ అమిత్ గార్గ్ నేతృత్వంలోని నిపుణులు తాజాగా ఓ పరిశోధనా పత్రాన్ని విడుదల చేశారు.

‘జీఏయూ’ ప్రాజెక్టు కింద..
దేశంలో గ్రామీణ ప్రాంతాల్లోని పెద్ద సంఖ్యలో ప్రజలు ఇప్పటికీ ఆవుల ఆధారంగా జీవిస్తున్నారు. వాటిని వ్యవసాయంలో వినియోగించుకోవడం, పాల ఉత్పత్తుల తయారీ, ఇతర అవసరాలకూ ఆవులపై ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అహ్మదాబాద్ ఐఐఎం ‘గాయ్ ఆధారిత్ ఉన్నతి (జీఏయూ)’ ప్రాజెక్టును ఈ ఏడాది జనవరిలో చేపట్టింది. ఇందులో భాగంగా ఆవుల ముఖాన్ని బట్టి గుర్తించేలా ‘ఫేస్ రికగ్నిషన్’ సాంకేతికతను వినియోగించి ‘గౌ విజన్ యాప్’ను రూపొందించింది.

వెయ్యి ఆవులపై పరిశోధనతో..
ఉత్తర ప్రదేశ్ లో ఓ ఎన్జీవో నిర్వహిస్తున్న గోశాలలో ఉన్న వెయ్యి ఆవులను తమ పరిశోధన కోసం ఎంచుకున్నట్టు ఐఐఎం నిపుణులు తెలిపారు. కృత్రిమ మేధ (ఏఐ) ఆధారంగా ఆ ఆవుల ముఖ కవళికలను నమోదు చేశామని.. వాటికి పేర్లు పెట్టి, ప్రత్యేకంగా ప్రొఫైల్స్ ను తయారు చేశామని వెల్లడించారు. ‘గౌ విజన్ యాప్’తో స్కాన్ చేసినప్పుడు 92 శాతం కచ్చితత్వంతో గుర్తించగలిగిందని తెలిపారు.

దాతల నుంచి విరాళాల స్వీకరణ కోసం..
దేశవ్యాప్తంగా గోశాలల్లో లక్షల సంఖ్యలో ఆవులు ఉంటున్నాయని.. దాతల విరాళాలతో వాటిని నిర్వహిస్తున్నారని ఐఐఎం నిపుణులు తెలిపారు. ‘గౌ విజన్ యాప్’ ఉంటే దాతలు ఆవులను దత్తత తీసుకోవడానికి వీలుంటుందని.. ఆ ఆవుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించుకోవచ్చని వివరించారు.

More Telugu News