గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ భార్య నికోల్ షనన్ తో ఎలాన్ మస్క్ కు అక్రమ సంబంధం?

25-07-2022 Mon 10:27
  • తన స్నేహితుడు బ్రిన్ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న మస్క్
  • విడాకులకు దరఖాస్తు చేసుకున్న బ్రిన్
  • తన భార్యతో విడిగా ఉన్నట్టు పేర్కొన్న బ్రిన్
Elon Musk has extramarital affair with Google co founder Sergey Brin wife Sergey Brin
గూగుల్ కో ఫౌండర్, బిలియనీర్ సెర్గీ బ్రిన్ భార్య నికోల్ షనన్ కు ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కు మధ్య అక్రమ సంబంధం ఉందనే వార్తలు సంచలనం రేపుతున్నాయి. ఈ మేరకు ప్రముఖ మీడియా సంస్థ 'వాల్ స్ట్రీట్ జర్నల్' కూడా కథనాన్ని ప్రచురించింది. చాలా ఏళ్లుగా మస్క్, సెర్గీ బ్రిన్ ల మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. అయితే తన భార్యతో మస్క్ కు అఫైర్ ఉందనే విషయం తెలిసినప్పటి నుంచి వారి మధ్య సంబంధం బలహీనపడుతూ వచ్చింది.

ఈ ఏడాది జనవరిలో బ్రిన్ విడాకులకు దరఖాస్తు చేశారు. 2021 డిసెంబర్ 15 నుంచి తాను, షనన్ విడిగా ఉంటున్నట్టు ఆయన పేర్కొన్నారు. తన కూతురుని జాయింట్ కస్టడీకి ఇవ్వాలని కోరారు.       

మరోవైపు, ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఓ పార్టీలో బ్రిన్ కు మస్క్ క్షమాపణలు చెప్పినట్టు సమాచారం. టెస్లా వాహనాల ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత కొన్ని వాహనాలను మస్క్ కొందరికి ఇచ్చారు. వారిలో బ్రిన్ కూడా ఉన్నారు. అంతేకాదు 2008లో టెస్లా కంపెనీ కొంత ఆర్థిక ఇబ్బందిని ఎదుర్కొన్నప్పుడు 5 లక్షల డాలర్లను మస్క్ కు బ్రిన్ సాయం చేశాడు. ఇంత మంచి స్నేహం అక్రమ సంబంధం కారణంగా చెడిపోయింది.

తన గర్ల్ ఫ్రెండ్, సింగర్ గ్రిమ్స్ తో మస్క్ విడిపోయిన కొన్ని నెలల తర్వాత మస్క్, షనన్ ల అఫైర్ వెలుగులోకి వచ్చింది. గ్రిమ్స్ తో మస్క్ కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరో విషయం ఏమిటంటే... మస్క్ కు సంబంధించిన మరో అఫైర్ తాజాగా బయటపడింది. తన కంపెనీలో ఎగ్జిక్యూటివ్ గా పని చేస్తున్న షివోన్ అనే మహిళతో ఆయనకు సంబంధం ఉంది. 2021 డిసెంబర్లో ఆమె కవల పిల్లలకు జన్మనిచ్చిందనే వార్తలు వచ్చాయి.