Mithun Chakraborty: ఓసారి ఆత్మహత్య ఆలోచన చేశా: మిథున్ చక్రవర్తి

  • బాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగిన మిథున్
  • 100కి పైగా చిత్రాల్లో నటించిన వైనం
  • ప్రతి కళాకారుడి జీవితంలోనూ కష్టాలు ఉంటాయని వెల్లడి
  • చివరి వరకు పోరాడాలని పిలుపు
Mithun Chakraborty says onece he think about suicide

అయాం ఏ డిస్కో డ్యాన్సర్ అంటూ ప్రేక్షకులపై చెరగని ముద్రవేసిన బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి తాజాగా ఆసక్తికర అంశాలను మీడియాకు వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తాను గతంలో ఓసారి ఆత్మహత్య చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చానని తెలిపారు. 

జీవితంలో కష్టాల గురించి ఎక్కువగా మాట్లాడడం తనకు ఇష్టముండదని, అయితే ప్రతి ఒక్క కళాకారుడి జీవితంలో కష్టాలు సహజమేనని అన్నారు. తన జీవితంలో ఆ కష్టాలు చాలా ఎక్కువగా ఉన్నాయని, ఇక జీవితంలో తానేమీ సాధించలేనని భావించి, ఇక బతకడం వృథా అనుకున్నసందర్భాలు కూడా ఉన్నాయని మిథున్ చక్రవర్తి తెలిపారు. కొన్ని కారణాలతో కోల్ కతాకు తిరిగిరాలేని పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పారు. 

అయితే, పోరాటం చేయకుండా జీవితాన్ని ముగించకూడదు అని తాను సలహా ఇస్తానని వెల్లడించారు. తాను జన్మతః పోరాటశీలినని, ఓడిపోవడం తనకు తెలియదని మిథున్ చక్రవర్తి పేర్కొన్నారు. అందుకే తాను ఈ స్థాయిలో ఉన్నానని గర్వంగా చెప్పారు. 

బాలీవుడ్ లో తనకంటూ సొంత ఇమేజ్ సాధించిన మిథున్ చక్రవర్తి రాజకీయాల్లోనూ ప్రవేశించి రాజ్యసభకు వెళ్లారు. టీఎంసీ పార్టీకి గుడ్ బై చెప్పి గతేడాది బీజేపీలో చేరిన ఈ బెంగాలీ బాబు గతంలో రాజ్యసభ సభ్యుడిగానూ కొనసాగారు. 

బాలీవుడ్ లో 80, 90వ దశకాల్లో మిథున్ చక్రవర్తి హవా కొనసాగింది. 100కి పైగా చిత్రాల్లో నటించిన ఆయన ఇటీవల వచ్చిన 'కశ్మీర్ ఫైల్స్' లోనూ నటుడిగా తన సత్తా చాటారు. 80వ దశకంలో జపనీస్ ఎలక్ట్రానిక్ దిగ్గజం పానాసోనిక్ కంపెనీ ప్రచారకర్తగా వ్యవహరించిన మిథున్ చక్రవర్తి, ఇటీవల కాలంలో వెబ్ హోస్టింగ్ సంస్థ గోడాడీ ప్రచారకర్తగానూ ఉన్నారు. మిథున్ చక్రవర్తి తెలుగులో వెంకటేశ్, పవన్ కల్యాణ్ ప్రధానపాత్రల్లో వచ్చిన 'గోపాల గోపాల' చిత్రంలోనూ నటించారు.

More Telugu News