బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై యథేచ్ఛగా దాడులు.. దేశవ్యాప్తంగా హిందువుల నిరసన
- నరైల్‌లో హిందువుల ఇళ్లను తగలబెట్టిన దుండగులు
- టీచర్ల హత్య, హిందూ మహిళలపై పెరిగిన అత్యాచారాలు
- నిందితులను కఠినంగా శిక్షిస్తామన్న బంగ్లాదేశ్ హోంమంత్రి
- నివేదిక కోరిన మానవ హక్కుల సంఘం
మత సామరస్యానికి విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బంగ్లాదేశ్ హోంమంత్రి అసదుజ్జమన్ ఖాన్ హెచ్చరించారు. హిందువులపై జరుగుతున్న వరుస దాడులపై స్పందించిన బంగ్లాదేశ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (NHRC) తీవ్రంగా స్పందించింది. వీటిపై విచారణ జరిపి దాడులను అడ్డుకోవడంలో నిర్లక్ష్యం ఉందో, లేదో తేల్చాలని హోంమంత్రిత్వశాఖను ఆదేశించింది. ఇస్లాంను దూషిస్తున్నారన్న పుకార్ల నేపథ్యంలోనే హిందువులపై దాడులు జరుగుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ నెల 15న నరైల్‌లోని సహపరా ప్రాంతంలో హిందువుల ఇళ్లను కొందరు తగలబెట్టారు. శుక్రవారం ప్రార్థనల తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. 18 ఏళ్ల కుర్రాడు ఫేస్‌బుక్‌లో ఇస్లాంకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టడంతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని, ఈ ఘటనకు పాల్పడినట్టు దుండగులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయకపోవడం గమనార్హం.