Girl: పెళ్లి చేసుకున్నా అత్యాచారం కేసు అలానే ఉంటుంది: ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

  • 14 ఏళ్ల బాలికపై 27 ఏళ్ల వ్యక్తి అత్యాచారం
  • ఆ తర్వాత ఓ పాపకు జన్మనిచ్చిన బాధితురాలు
  • బాధితురాలిని వివాహం చేసుకున్నానన్న నిందితుడు
  • అయినా కేసు తొలగిపోదన్న న్యాయస్థానం
  • బెయిలు ఇచ్చేందుకు నిరాకరణ
Delhi High Court denied to give bail to rape accused

అత్యాచార బాధితురాలిని వివాహం చేసుకున్నంత మాత్రాన నిందితుడిపై నమోదైన కేసు తొలగిపోదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. కాబట్టి పెళ్లి చేసుకున్నాడన్న కారణంతో బెయిల్ మంజూరు చేయడం కుదరదని తేల్చి చెప్పింది. ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. నవంబరు 2019లో 27 ఏళ్ల నిందితుడు 14 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడు. రెండేళ్ల తర్వాత అక్టోబరు 2021లో నిందితుడి ఇంటి వద్ద బాధిత బాలిక కనిపించింది. అప్పటికి 8 నెలల క్రితం బాధిత బాలిక ఓ పాపకు జన్మనిచ్చింది. ఆ తర్వాత మళ్లీ గర్భం దాల్చింది. 

బాలికపై అత్యాచారానికి పాల్పడినందుకు నిందితుడిపై కేసు నమోదైంది. ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితుడు బెయిలు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. విచారించిన న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. అత్యాచార కేసుల్లో బాధిత బాలిక అంగీకరించిందా? లేదా? అన్నదానితో సంబంధం లేదని పేర్కొంది. ఒకవేళ బాలిక తెలివి తక్కువ తనంతో అంగీకరించినా చట్టం ప్రకారం దానికి గుర్తింపు లేదని స్పష్టం చేసింది. 

అయితే, బాధిత బాలికను తాను గుడిలో వివాహం చేసుకున్నానని, కాబట్టి తనకు బెయిలు మంజూరు చేయాలని నిందితుడు కోరాడు. స్పందించిన న్యాయస్థానం.. బాధిత బాలికను వివాహం చేసుకున్నంత మాత్రాన అతడు పవిత్రుడైనట్టు కాదని పేర్కొంటూ బెయిలు ఇచ్చేందుకు తిరస్కరించింది. పెళ్లి చేసుకున్నానన్న కారణంతో అతడు కేసు నుంచి తప్పించుకోలేడని తేల్చి చెప్పింది.

More Telugu News