ఎట్టకేలకు వెనక్కి తగ్గిన శ్రావణ భార్గవి

23-07-2022 Sat 22:02 | Both States
  • వీడియో నుంచి అన్నమాచార్య కీర్తన తొలగింపు
  • మ్యూజిక్ తో వీడియో కొనసాగింపు
  • నెగెటివిటీని ఏమాత్రం ప్రోత్సహించనని వెల్లడి
  • ప్రతి అంశానికి దృష్టికోణం ఉంటుందని వ్యాఖ్యలు
Singer Sravana Bhargavi deletes Annamacharya keertan from her video
అన్నమయ్య కీర్తనతో ఓ వీడియో రూపొందించి వివాదంలో చిక్కుకున్న టాలీవుడ్ గాయని శ్రావణ భార్గవి ఎట్టకేలకు వెనక్కి తగ్గింది. వివిధ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో, తన వీడియోలో బ్యాక్ గ్రౌండ్ లో వస్తున్న అన్నమయ్య కీర్తనను తొలగించింది. అయితే వీడియోను మాత్రం తొలగించలేదు. కేవలం సంగీతం వినిపిస్తుండగా, ఆ వీడియో కొనసాగించింది. 

దీనిపై గాయని శ్రావణ భార్గవి స్వయంగా వివరణ ఇచ్చింది. తానెప్పుడూ కావాలని వివాదాలను రేకెత్తించలేదని స్పష్టం చేసింది. అన్నమయ్య పట్ల విశేష గౌరవంతో ఆ వీడియో రూపొందించానని, అందుకు ఎంతో శ్రమ, సమయం ఖర్చు చేశానని వెల్లడించింది. ప్రతికూల ధోరణులకు తానెప్పుడూ దూరంగా ఉంటానని, ఏమాత్రం ప్రోత్సహించనని స్పష్టం చేసింది. 

ఏదేమైనా తన వీడియో ఓ కళాఖండం అని విశ్వసిస్తున్నానని, ప్రతి అంశానికి ఓ దృష్టికోణం ఉంటుందని అభిప్రాయపడింది. అది చూసే తీరును బట్టి ఉంటుందని, తీరు మారినప్పుడే మార్పు కనబడుతుందని శ్రావణ భార్గవి పేర్కొంది.