సల్మాన్ ఖాన్ ముంబయి పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లింది ఎందుకో తెలుసా...?

22-07-2022 Fri 19:48 | National
  • ఈ ఉదయం సీపీ ఆఫీసులో కనిపించిన సల్మాన్ ఖాన్
  • ఇటీవల సల్మాన్ కుటుంబానికి బెదిరింపులు
  • తుపాకీ లైసెన్స్ కోసం పోలీసులను ఆశ్రయించిన స్టార్ హీరో
Salman Khan reportedly seeking gun licence from Mumbai police
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇవాళ ముంబయి పోలీస్ కమిషనర్ వివేక్ ఫన్సాల్కర్ కార్యాలయంలో దర్శనమివ్వడం చర్చనీయాంశంగా మారింది. సల్మాన్ సీపీ కార్యాలయానికి వెళ్లడంపై తాజా సమాచారం వెల్లడైంది. సల్మాన్ ఖాన్ గన్ లైసెన్స్ కోసమే సీపీ ఆఫీసుకు వెళ్లాడని సన్నిహిత వర్గాలు తెలిపాయి. 

ఇటీవల పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య తర్వాత సల్మాన్ ఖాన్, ఆయన తండ్రి సలీమ్ ఖాన్ లను చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. ఈ నేపథ్యంలో, ప్రాణరక్షణ కోసం తుపాకీ కావాలంటూ సల్మాన్ ఖాన్ పోలీసులను ఆశ్రయించినట్టు తెలిసింది. సిద్ధూ మూసేవాలా హత్య కేసులో సూత్రధారిగా భావిస్తున్న లారెన్స్ బిష్ణోయ్ గతంలో సల్మాన్ హత్యకు భారీ స్కెచ్ వేయడం తెలిసిందే. రూ.4 లక్షలు ఖర్చుచేసి విదేశాల నుంచి అత్యాధునిక తుపాకీని కూడా తెప్పించినట్టు కథనాలు వచ్చాయి.