Vijay Devarakonda: విజయ్ దేవరకొండ 199 రూపాయల చెప్పులు ధరించడంపై పర్సనల్ స్టయిలిస్ట్ వివరణ

Personal stylist explains Vijay Devarakonda simple dressing
  • ముంబయిలో లైగర్ హిందీ ట్రైలర్ విడుదల
  • సింపుల్ లుక్ తో హాజరైన విజయ్ దేవరకొండ
  • ఆశ్చర్యపోయిన రణవీర్ సింగ్
  • స్పందించిన స్టయిలిస్ట్
  • సినిమాలో పాత్ర ప్రకారమే విజయ్ డ్రెస్సింగ్ అని వెల్లడి
విజయ్ దేవరకొండ హీరోగా రూపుదిద్దుకుంటున్న 'లైగర్' నుంచి ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే. ముంబయిలో 'లైగర్' హిందీ వెర్షన్ ట్రైలర్ రిలీజ్ కాగా, ఆ వేడుకకు హీరో విజయ్ దేవరకొండ ఎంతో సింపుల్ లుక్ తో హాజరుకావడం రణవీర్ సింగ్ వంటి బాలీవుడ్ స్టార్ ను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ కార్యక్రమంలో విజయ్ సాధారణ స్లిప్పర్స్ ధరించి కనిపించాడు. దీనిపై పర్సనల్ స్టయిలిస్ట్ హర్మన్ కౌర్ వివరణ ఇచ్చింది. 

లైగర్ ప్రచారం మొదలైనప్పటి నుంచి తమను అనేక బ్రాండ్లకు చెందినవారు, డిజైనర్లు సంప్రదించేవారని వెల్లడించింది. విజయ్ తో తమ బ్రాండ్ దుస్తులు, ఇతర ఉపకరణాలు ధరింపజేసేలా చూడాలని కోరేవారని వివరించింది. దాంతో, విజయ్ దేవరకొండను ప్రమోషన్స్ సమయంలో భారీ రేంజిలో సిద్ధం చేయాలని నిర్ణయించుకున్నట్టు హర్మన్ కౌర్ వెల్లడించింది. 

"అయితే ఒకరోజు విజయ్ దేవరకొండ నుంచి ఫోన్ వచ్చింది. లైగర్ లో తన క్యారెక్టర్ ను ప్రతిబింబించేలా డ్రెస్సింగ్ ఉండాలని విజయ్ సూచించాడు. లైగర్ లో తన పాత్ర ఎలాంటి అంచనాలు లేని ఓ అండర్ డాగ్ వంటిది. దాంతో ఎలాంటి హంగామా లేకుండా సింపుల్ లుక్ ఉండాలని కోరాడు. అంతేకాదు, మామూలు చెప్పులు కావాలని అడిగాడు. దాంతో నేను కాస్త ఆలోచనలో పడ్డాను. 

కానీ విజయ్ ఆలోచనలపై నాకెప్పుడూ నమ్మకం ఉంది. అతడు ఎలాంటి వేషధారణతో అయినా జాతీయ స్థాయిలో అందరూ తన గురించి మాట్లాడుకునేలా చేయగలడు. ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్ లో విజయ్ ధరించిన టీషర్టు, రూ.199 చెప్పులు అన్నీ అతడి ఆలోచన మేరకే తీసుకున్నాం. 

కానీ ఎక్కడో ఏదో సంశయం వెనక్కిలాగినా, విజయ్ సూచనలతో ముందడుగు వేశాం. ముంబయి వంటి మహానగరంలో, ఓ భారీ ఈవెంట్ లో ఆ విధంగా ప్రజల ముందుకు వెళ్లడానికి ఎంతో ధైర్యం కావాలి. కానీ విజయ్ గెటప్ కు ప్రజల నుంచి ఎంతటి ఆదరణ లభిస్తోందో చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది" అంటూ హర్మన్ కౌర్ వివరించింది.
Vijay Devarakonda
Dressing
Slippers
Harmann Kaur
Personal Stylist

More Telugu News