100 రోజులను పూర్తి చేసుకున్న 'కేజీఎఫ్ 2'

  • యశ్ హీరోగా వచ్చిన 'కేజీఎఫ్ 2'
  • విడుదలైన ప్రతి భాషలో విజయవిహారం
  • బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు 
  • తదుపరి సినిమాగా రానున్న 'సలార్'
KGF 2 Movie Update

యశ్ హీరోగా ఆ మధ్య వచ్చిన 'కేజీఎఫ్' సంచలన విజయాన్ని సాధించింది. దాంతో ఆ సినిమాకి సీక్వెల్ గా 'కేజీఎఫ్ 2'ను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. హోంబలే ఫిలిమ్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించాడు. కన్నడతో పాటు ఇతర భాషల్లోను ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేశారు.

ఈ రోజుతో ఈ సినిమా 100 రోజులను పూర్తిచేసుకుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ మేకర్స్ ఒక పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సినిమాను ఇంతగా ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేశారు. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించిన ఈ సినిమాలో ప్రతినాయకుడిగా సంజయ్ దత్ కనిపించాడు. విడుదలకి ముందే ఈ సినిమాలో ఆయన లుక్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది.

మొదటి నుంచి కూడా ఫస్టు పార్టుకు మించి సెకండ్ పార్టు ఉంటుందని చెబుతూ వచ్చారు. అలాగే ప్రేక్షకుల అంచనాలను అందుకున్నారు. రిలీజ్ చేసిన ప్రతి భాషలోను ఈ సినిమా రికార్డుస్థాయి వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు అదే బ్యానర్ లో అదే దర్శకుడు ప్రభాస్ హీరోగా 'సలార్' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాదిలో ఈ సినిమా విడుదల కానుంది.

More Telugu News