అమిత్ షాతో భేటీ నిజ‌మేన‌న్న కోమ‌టిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ... కాంగ్రెస్‌ను వీడేది లేదన్న మునుగోడు ఎమ్మెల్యే

22-07-2022 Fri 16:24
  • బీజేపీలో చేర‌తారంటూ కోమ‌టిరెడ్డిపై ప్ర‌చారం
  • ఇటీవ‌లే అమిత్ షాతో ఢిల్లీలో భేటీ అయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
  • టీఆర్ఎస్‌ను ఓడించే పార్టీలోనే ఉంటాన‌న్న రాజ‌గోపాల్ రెడ్డి
komatireddy raj gopal reddy comments on his party change
న‌ల్ల‌గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యేగా కొన‌సాగుతున్న కాంగ్రెస్ నేత కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి... బీజేపీలో చేర‌తారంటూ ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌చారం జ‌రుగుతూనే ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే ఢిల్లీ బీజేపీ కీల‌క నేత‌, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో కోమ‌టిరెడ్డి భేటీ అయ్యార‌న్న వార్త‌ల‌పై ఆయ‌న తాజాగా స్పందించారు. తాను అమిత్ షాతో భేటీ అయిన మాట వాస్త‌వమేనని కూడా వెల్ల‌డించారు. 

ఈ సంద‌ర్భంగా రాజ‌గోపాల్ రెడ్డి మ‌రో కీల‌క ప్ర‌కట‌న కూడా చేశారు. కాంగ్రెస్ పార్టీని తాను వీడేది లేద‌ని కూడా ఆయ‌న ప్ర‌క‌టించారు. తెలంగాణ‌లో టీఆర్ఎస్‌ను ఓడించే పార్టీలో ఉంటాన‌ని ఆది నుంచి చెబుతూ వ‌స్తున్న కోమ‌టిరెడ్డి... తాను గ‌తంలో చెప్పిన మాట‌కే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు.