బాబాయ్ ను చంపి ఆ నేరం నాపై వేయాలని చూశారు.. రఘురామపైనా అలాగే చేయబోయారు: చంద్రబాబు ఆరోపణలు

22-07-2022 Fri 15:37
  • గోదావరి ముంపు ప్రాంతాల పర్యటనలో టీడీపీ అధినేత ఆరోపణలు
  • జగన్ కు ఏమాత్రం మానవత్వం లేదని.. ప్రజల ప్రాణాలంటే విలువ లేదని మండిపాటు
  • వరద బాధితులకు న్యాయం జరిగే వరకు టీడీపీ పోరాడుతుందని వెల్లడి
Chandrababu tour in flood affected areas
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును హత్య చేసేందుకు ప్రయత్నం జరిగిందని.. ఆయనను తన ప్రాంతానికి రానివ్వకుండా చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులోనూ ఇలాగే చేశారని.. బాబాయిని చంపి ఆ నేరం తనపై వేసేందుకు ప్రయత్నించారని పరోక్షంగా ఏపీ సీఎం జగన్ ను ఉద్దేశించి ఆరోపణలు గుప్పించారు. ఇప్పుడు రఘురామకృష్ణ రాజును కూడా హత్య చేసి.. దానిని వేరేవారిపైకి నెట్టివేసేందుకు కుట్ర చేశారని విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు నాయుడు.. ఈ క్రమంలో పలుచోట్ల మాట్లాడారు.

మానవత్వం లేని మనిషి జగన్..
ఏపీ సీఎం జగన్ ఏ మాత్రం మానవత్వం లేని మనిషి అని.. ఆయనకు ప్రజల ప్రాణాలంటే అసలు లెక్క లేదని చంద్రబాబు ఆరోపించారు. ప్రజలను బురదలో ముంచేసి.. సీఎం గాల్లో తిరుగుతున్నారని విమర్శించారు. ఎక్కడికక్కడ జనం సకాలంలో స్పందించి గోదావరి కరకట్టల వెంట ఇసుక బస్తాలు వేసుకుని గ్రామాలను రక్షించుకున్నారని.. లేకుంటే భారీ నష్టం జరిగి ఉండేదని వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టు గోదావరి పాలు అయిందని.. దాన్ని వెంటనే పూర్తి చేసి ఉంటే ఇలా భారీ వరదలు వచ్చి ఉండేవి కాదని పేర్కొన్నారు.

తప్పులపై నిలదీస్తే అక్రమ కేసులా?
వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తప్పులు చేస్తుంటే నిలదీస్తున్నందుకు అక్రమ కేసులతో వేధిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. ఎంత మందిని జైల్లో పెడతారో చూస్తామని.. తప్పుడు పనులు చేసిన ఎవరినీ భవిష్యత్తులో వదిలిపెట్టబోమని హెచ్చరించారు. వరద బాధితులకు న్యాయం జరిగే వరకు టీడీపీ పోరాటం చేస్తుందని ప్రకటించారు.