Kiren Rijiju: జ‌మిలి ఎన్నిక‌ల అంశం లా క‌మిష‌న్ ప‌రిశీల‌న‌లో ఉంది: కేంద్ర ప్ర‌భుత్వం

  • జ‌మిలి ఎన్నిక‌ల‌పై పార్ల‌మెంట‌రీ స్టాండింగ్ క‌మిటీ నివేదిక‌
  • నివేదిక ఆధారంగా లా క‌మిష‌న్ అధ్య‌యనం
  • ఓ ప్ర‌ణాళిక‌ను రూపొందించే ప‌నిలో లా క‌మిష‌న్‌
  • బీజేపీ ఎంపీ ప్ర‌శ్న‌కు కేంద్ర మంత్రి కిర‌ణ్ రిజిజు స‌మాధానం
union minister kiren rijiju says that law commission studying on jamili polls

లోక్ స‌భ ఎన్నిక‌ల‌తో పాటు అన్ని రాష్ట్రాల్లోని అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను ఒకేసారి నిర్వ‌హించే దిశ‌గా సాగుతున్న జ‌మిలి ఎన్నిక‌ల ప్ర‌తిపాద‌న‌ల‌పై కేంద్ర ప్ర‌భుత్వం శుక్ర‌వారం పార్ల‌మెంటులో కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. జ‌మిలి ఎన్నిక‌ల అంశం ప్ర‌స్తుతం లా క‌మిష‌న్ ప‌రిశీల‌నలో ఉంద‌ని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్ స‌భ‌కు తెలిపారు. అజ్మీర్ ఎంపీ భ‌గీర‌థ్ చౌద‌రి అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానంగా రిజిజు పార్ల‌మెంటుకు లిఖితపూర్వ‌క‌ స‌మాధానం ఇచ్చారు.

జ‌మిలి ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌పై పార్ల‌మెంట‌రీ స్టాండింగ్ క‌మిటీతో పాటుగా కేంద్ర ఎన్నిక‌ల సంఘంతో చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లు ఆ స‌మాధానంలో రిజిజు తెలిపారు. ఈ అంశంపై భాగ‌స్వామ్య ప‌క్షాల‌తోనూ సుదీర్ఘంగా చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లు ఆయ‌న తెలిపారు. స్టాండింగ్ క‌మిటీ స‌మ‌ర్పించిన ఓ నివేదిక‌లో కొన్ని ప్ర‌తిపాద‌న‌ల‌తో పాటు సిఫార‌సులు ఉన్నాయ‌ని ఆయ‌న వెల్ల‌డించారు. ఈ నివేదిక‌ను ఆధారం చేసుకుని లా క‌మిష‌న్ ప్ర‌స్తుతం అధ్య‌య‌నం చేస్తోంద‌ని తెలిపారు. జ‌మిలి ఎన్నిక‌ల‌కు సంబంధించి ఓ ప్ర‌ణాళికను రూపొందించే ప‌నిలో లా క‌మిష‌న్ ఉంద‌ని ఆయ‌న వెల్ల‌డించారు. 

వేర్వేరుగా ఎన్నిక‌లు జరగడం వ‌ల్ల భారీగా ప్ర‌జా ధ‌నం ఖ‌ర్చు అవుతోంద‌ని పార్ల‌మెంట‌రీ స్టాండింగ్ క‌మిటీ త‌న నివేదిక‌లో పేర్కొంద‌ని రిజిజు తెలిపారు. 2014-22 మ‌ధ్య కాలంలోనే 50 అసెంబ్లీల‌కు ఎన్నిక‌లు జ‌రిగాయ‌ని చెప్పిన ఆయ‌న‌.. అందుకు గాను రూ.7 వేల కోట్ల‌కు పైగా ప్ర‌జాధ‌నం ఖ‌ర్చయిందని చెప్పారు. ఈ త‌ర‌హాలో ప్ర‌జాధ‌నం వృథా ఖర్చును నివారించేందుకే జ‌మిలి ఎన్నిక‌ల‌ను ప్ర‌తిపాదించిన‌ట్లు రిజిజు పేర్కొన్నారు.

More Telugu News