పెంపుడు కుక్కలు తోక ఊపడంలోనూ ఎన్నో అర్థాలున్నాయంటున్న శాస్త్రవేత్తలు!

22-07-2022 Fri 14:15
  • పెంపుడు జంతువుల తీరుపై చైనా శాస్త్రవేత్తల పరిశోధన
  • శునకాలు కొత్త వారి పట్ల ఎలా వ్యవహరిస్తాయి, వారిని నమ్మితే ఏం చేస్తాయన్నది పరిశీలన
  • తోకలను కుడి వైపు ఎక్కువగా ఊపితే సదరు వ్యక్తులను ఇష్టపడతాయని వెల్లడి
  • భయపడ్డా, ఇష్టం లేకున్నా ఎడమ వైపు ఊపుతాయని వివరణ
What wag Dogs tails right humans love research suggests
కుక్క అన్నాక తోక ఊపడం మామూలే. దాన్ని పెంచుకునే వాళ్లు, దానితో ఆడే వాళ్లు కనిపిస్తే తోక ఊపుకుంటూ చుట్టూ తిరుగుతుంటాయి కూడా. తమ యజమానులను, తమను ప్రేమగా చూసుకునేవారి పట్ల శునకాలు చూపించే కృతజ్ఞత అది అని జంతుశాస్త్ర నిపుణులు చెప్తుంటారు. మరి ఎవరైనా కొత్త వారిని చూసినప్పుడు కుక్కలు ఎలా వ్యవహరిస్తాయన్న దానిపై చైనాలోని బీజింగ్ లో ఉన్న చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. పెంపుడు జంతువులు ఏ సమయంలో ఎలాంటి ప్రవర్తన చూపిస్తాయన్నది పరిశీలించారు.

 కొత్త వారైనా సరే తమకు నచ్చితే శునకాలు తమ తోకలను కుడివైపునకు ఎక్కువగా తిప్పుతున్నట్టు గుర్తించారు. ఎడమ వైపు కూడా తోకను ఊపినా.. కుడివైపు ఎక్కువగా వంచడం, ఎక్కువగా ఊపుతుండటం చేస్తున్నట్టు గమనించారు.

మెదడులో సంతోషకరమైన భావనతోనే..
మనుషులకైనా, జంతువులకైనా మెదడులో రెండు భాగాలు ఉంటాయి. అందులో కుడిభాగం ఎడమవైపు సగం శరీరాన్ని, ఎడమ భాగం కుడివైపు సగం శరీరాన్ని నియంత్రిస్తుంటాయి. ఈ క్రమంలోనే శునకాలకు సంతోషకరమైన భావన కలిగినప్పుడు.. వాటి మెదడు ఎడమ భాగంలో సంతోషకరమైన అంశాలకు సంబంధించిన భాగం యాక్టివ్ గా మారుతున్నట్టు గుర్తించామని పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త యాంగ్ క్యూ ఝాంగ్ తెలిపారు. ఈ క్రమంలోనే శునకాలు తోక కుడివైపు ఎక్కువగా ఊపుతున్నట్టు గుర్తించామన్నారు. 
  • ఒకవేళ ఆయా వ్యక్తులు నచ్చకపోయినా, భయపడినా శునకాలు తమ తోకలను ఎడమ వైపు ఎక్కువగా ఊపుతున్నట్టు గుర్తించామని తెలిపారు.
  • కుక్క తోకపై పరిశోధన కదా అని ఏదో ఆషామాషీగా చేయలేదు. సుమారు 25 కుక్కల తోకలపై త్రీడీ మోషన్ సెన్సర్లు అమర్చి.. రోజూ కాసేపు కొత్త వారిని చూపిస్తూ, అదే సమయంలో వాటి మెదడును స్కాన్ చేస్తూ పరిశోధన నిర్వహించారు.
  • ఈ క్రమంలో అన్ని శునకాలు, అన్ని రోజులు కలిపి మొత్తంగా 21 వేల సార్లు తోకలు ఊపడాన్ని పరిశీలించి ఈ నిర్ధారణకు వచ్చారు. ఐసైన్స్ జర్నల్ లో ఈ పరిశోధన వివరాలు ప్రచురితం అయ్యాయి.