Cheteshwar Pujara: కౌంటీల్లో చెలరేగుతున్న పుజారా.. 125 ఏళ్ల రికార్డును బద్దలుగొట్టిన ఇండియన్ స్టార్ బ్యాటర్!

Pujara Joins Indian Legend In Elusive List With Lords Double Century
  • కౌంటీల్లో ఈ సీజన్‌లో మూడో ‘డబుల్’ చేసిన పుజారా
  • 125 ఏళ్ల క్రితం ససక్స్ తరపున రంజిత్ సింహ్‌జీ డబుల్ సెంచరీ 
  • మళ్లీ ఇన్నాళ్లకు ఆ ఘనత సాధించిన బ్యాటర్‌గా పుజారా రికార్డ్
  • మిడిల్‌సక్స్‌పై డబుల్ సెంచరీ సాధించిన తొలి ఇండియన్‌గానూ చరిత్ర పుటల్లోకి

పేలవ ఫామ్‌తో విమర్శలు ఎదుర్కొని భారత జట్టులో చోటు కోల్పోయిన టీమిండియా స్టార్ ఓపెనర్ చటేశ్వర్ పుజారా కౌంటీల్లో అదరగొడుతున్నాడు. ససక్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా లార్డ్స్‌లో మిడిల్‌సక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మరోమారు అదరగొట్టాడు. డబుల్ సెంచరీ (231) బాది అత్యంత అరుదైన ఘనత సాధించాడు. 125 సంవత్సరాల క్రితం ఎంసీసీతో జరిగిన మ్యాచ్‌లో ‘రంజీ’గా పిలిచే రంజిత్‌సింహ్‌జీ ఇదే మైదానంలో ససక్స్ తరపున డబుల్ సెంచరీ సాధించాడు. మళ్లీ ఇన్నాళ్లకు ఆ ఘనత సాధించిన భారత క్రికెటర్‌గా పుజారా రికార్డులకెక్కాడు. 

పుజారాకు ఈ సీజన్‌లో ఇది మూడో డబుల్ సెంచరీ కాగా, కౌంటీల్లో ఐదోది. మొత్తంగా 16వది. అంతేకాదు, మిడిల్‌సక్స్‌పై డబుల్ సెంచరీ సాధించిన తొలి ఇండియన్‌గానూ పుజారా రికార్డులకెక్కాడు. దాదాపు 9 గంటలపాటు క్రీజులో ఉన్న పుజారా జట్టు 523 పరుగులు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. కాగా లార్డ్స్‌లో ససక్స్‌కు ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. 2005లో 522 పరుగులు సాధించింది. 

1907 నుంచి 1933 వరకు భారత నవనగర్‌ను పాలించిన రంజీ.. అత్యంత స్టైలిష్ బ్యాటర్‌గా పేరు సంపాదించుకున్నారు. అంతేకాదు, లెగ్ గ్లాన్స్ (Leg-Glance)ను కనిపెట్టి రికార్డులకెక్కారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకున్న రంజీ 1896-1902 మద్య ఇంగ్లండ్‌ తరపున 15 టెస్టులు ఆడారు. భారత్‌‌కు 1932లో టెస్టు హోదా లభించింది. అప్పటికి ఒక్క ఏడాది ముందు 60 ఏళ్ల వయసులో రంజీ మృతి చెందారు. ఆయన మరణానంతరం భారత్‌లోని ప్రీమియర్ ఫస్ట్‌క్లాస్ టోర్నమెంటుకు ఆయన పేరున రంజీ ట్రోఫీగా పేరు పెట్టారు.

  • Loading...

More Telugu News